అదుపుతప్పి నదిలోకి జారిన విమానం.. తప్పిన పెను ప్రమాదం
- IndiaGlitz, [Saturday,May 04 2019]
అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన జాక్సన్ విల్లే విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాదం తప్పింది. క్యూబా నుంచి ఫ్లోరిడా వస్తున్న బోయింగ్ 737 విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా జారిపోయి పక్కనున్న సెయింట్ జాన్స్ నదిలోకి వెళ్లిపోయింది. దీంతో విమానంలోని 136 మంది ప్రయాణికులు, సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. కాగా ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. విమానం నీటిలో పూర్తిగా మునగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టి గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి 9: 40 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యం వెలుగు చూసింది.
ఎవరికేం కాలేదు.. అందరూ క్షేమం..!
నావల్ స్టేషన్ గంటానమో బేలో ల్యాండ్ అవుతున్న సమయంలో జాక్సన్‌విల్లేలోని సెయింట్ జాన్స్ నదిలోకి దూసుకువెళ్లిందని నావల్ ఎయిర్‌స్టేషన్ అధికార ప్రతినిధి మీడియాకు వివరించారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన నుంచి ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారని.. వారంతా ప్రాణాలతో బయటపడ్డారని కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాక్సన్‌విల్లే మేయర్ ట్వీట్ చేశారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.