Telangana Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఖరారు.. డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు..!
- IndiaGlitz, [Friday,October 06 2023]
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. సెమీ ఫైనల్స్‌గా భావించే ఈ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఖరారు చేసిందని సమాచారం. అక్టోబర్ 8 నుంచి 10 మధ్యలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం మధ్యలో ఎన్నికలు నిర్వహించేలా సీఈసీ షెడ్యూల్ రూపొందించిందని చెబుతున్నారు.
2018లో మాదిరిగానే ఎన్నికల షెడ్యూల్..
ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నారట. నవంబర్ 12 నుంచి 20 మధ్య ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు, నవంబర్ 28న మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు, చివరగా డిసెంబర్ 7న రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికలు జరపనున్నారని తెలుస్తోంది. ఇక డిసెంబర్ 10 నుంచి 15వ తేదీల మధ్య ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారట. 2018లో మాదిరిగానే ఇప్పుడు కూడా ఎన్నికలు నిర్వహించేలా సీఈసీ ప్లాన్ చేసింది.
ఎన్నికల కసరత్తు మొదలుపెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం..
మిజోరం అసెంబ్లీకి డిసెంబర్ 17వ తేదీతో గడువు ముగియనుండగా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీల గడువు మాత్రం జనవరిలో ముగియనుంది. మిజోరంలో బీజేపీ మిత్రపక్షం మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల కసరత్తు మొదలుపెట్టేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటీవల మూడు రోజుల పాటు సీఈసీ బృందం తెలంగాణలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన సంగతి తెలిసిందే. అలాగే ఎన్నికల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపైనా ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల తుది జాబితాను కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 3.17కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.