Revanth Reddy:సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చే తొలి ఉద్యోగం ఎవరికో తెలుసా..?

  • IndiaGlitz, [Wednesday,December 06 2023]

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే రేవంత్ రెడ్డి.. తొలి ఉద్యోగం ఎవరికి ఇవ్వనున్నారో తెలుసా. నాంపల్లికి చెందిన రజిని అనే దివ్యాంగురాలికి ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు. ఈ సందర్భంగా రజినీ ఉద్యోగ నియామక ఫైల్‌పై సంతకం చేయనున్నారు. ఈ మేరకు ఆమెకు రేవంత్.. ప్రత్యేక ఆహ్వానం పంపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రజినీకి ఉద్యోగం ఇస్తానని రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తనకు ఆహ్వానం లభించడంపై దివ్యాంగురాలు ఆ యువతి సంతోషం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 17న నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డిని కలిశారు. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని.. తనకు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయారు. దీంతో చలించిన రేవంత్ రెడ్డి.. ఆమెకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తొలి ఉద్యోగం తనకే ఇస్తానంటూ హామీనిచ్చారు. అలాగే ఆరు గ్యారెంటీల కార్డును కూడా సంతకం చేసి అందజేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన ఇచ్చిన మాటను సీఎం హోదాలో నెరవేర్చనున్నారు.

కాగా తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవ సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చకాచకా జరుగుతున్నాయి.స్టేడియానికి జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలుస్తోంది.