Shanthi Swaroop: తొలి తరం తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూత

  • IndiaGlitz, [Friday,April 05 2024]

తెలుగు మీడియా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తొలి తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని మీడియా, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. దూరదర్శన్‌లో వార్తలు చదివిన మొట్టమొదటి యాంకర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఆయన వార్తలు చెబుతుంటే ప్రజలు ఎంతో చక్కగా ఆలకించేవారు. అంతలా ప్రతి ఒక్కరి ఇంట్లో కుటుంబసభ్యుడిలా అయిపోయారు.

1977, అక్టోబరు 23న నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి తెలుగు దూరదర్శన్ కార్యక్రమాలను ప్రారంభించారు. సోమాజిగూడలోని దూరదర్శన్ స్టూడియో నుంచే శాంతి స్వరూప్ వార్తలు చదివేవారు. 1978లో దూరదర్శన్‌లో ఉద్యోగిగా చేరారు. అయితే 1983 నవంబరు 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటలకు ఈ వార్తలు ప్రసారం అయ్యాయి. అందులో మొదటి వార్తగా బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు ప్రారంభించారు అని చదివారు.

అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రస్తానం 2011 వరకు కొనసాగింది. ఇప్పటిలా టెలీ ప్రాంప్టర్లు లేకుండానే ఆయన వార్తలు చదివేవారు. బులిటెన్ మొదలు కాక ముందే వార్తలన్నింటిని ముందుగానే చదువుకునేవారు. అనంతరం చకచకా అందరికీ అర్థమయ్యేలా వార్తలు చెప్పేవారు. ఇప్పటి యాంకర్లు ఎందరికో ఆయన గురువుగా ఉన్నారు. ఓసారి బాగా గుర్తుండిపోయిన విషాదకరమైన వార్త..? సంతోషకరమైన వార్త..? ఏది అని ప్రశ్నించగా.. రెండు కూడా విషాద వార్తలే అని చెప్పారు.

మొదటిది దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణం గురించి చెబుతూ చాలా బాధపడ్డాను అని.. రెండో వార్త ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ మరణ వార్త అని చెప్పుకొచ్చారు. ఇందిరా గాంధీ మరణం కంటే రాజీవ్ గాంధీ గారి మరణం చాలా దారుణమని.. ఆయన శరీరం ముక్కలు ముక్కలూ అయిందని అందుకే ఆ వార్త ఇప్పటికీ నాకు గుర్తుండి పోయిందని తెలిపారు. అలా తన ప్రస్థానంలో ఎన్నో విషాదకర.. సంతోషకరమైన వార్తలు ఆయన చదివి ప్రజలకు చేరువయ్యారు.