BRS Party:బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి : గుడిసెలపై పడ్డ బాణాసంచా, సిలిండర్ బ్లాస్ట్.. ఇద్దరి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటు చేసుకుంది. కేడర్ పేల్చిన బాణాసంచా ధాటికి పక్కనే వున్న గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీలక నేతలు సైతం హాజరయ్యారు. దీంతో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చారు. అయితే పక్కనేవున్న గుడిసెపై నిప్పు రవ్వలు పడి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు కలిసి బక్కెట్లు, బిందెలతో నీళ్లు చల్లారు.
సిలిండర్ పేలడంతో తెగిపడ్డ కాళ్లు , చేతులు:
అయితే అప్పటికే గుడిసెలకు పూర్తి మంటలు వ్యాపించాయి. వాటిని ఆర్పే హడావుడిలో లోపల వున్న గ్యాస్ సిలిండర్ను గమనించకపోవడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి పక్కనే వున్న వారి కాళ్లు , చేతులు తెగిపడ్డాయి. వీరంతా తీవ్రంగా గాయపడటంతో క్షతగాత్రులను పోలీస్ వాహనాల్లో ఖమ్మం ఆసుపత్రి తరలించారు. వీరిలో ఒకరు మార్గమధ్యంలోనే చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. దీంతో ఆత్మీయ సమ్మేళనాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు రద్దు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమీప ప్రాంతాల నుంచి ఫైరింజన్లను రప్పించిన పోలీసులు మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
కేటీఆర్ దిగ్భ్రాంతి :
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అగ్నిప్రమాదం ఘటనపై మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు, నేతలతో మాట్లాడి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని కేటీఆర్ ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా వుంటామని ఆయన సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments