దుబాయ్ డ్యూటీ ఫ్రీ గిడ్డంగి యార్డులో మంటలు.. విశేషం ఏంటంటే..
- IndiaGlitz, [Wednesday,August 12 2020]
దుబాయ్ డ్యూటీ ఫ్రీ గిడ్డంగి యార్డులో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి కాస్తా క్షణాల్లో దావానంలా వ్యాపించాయి. ఆ మంటలను దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు క్షణాల్లో అదుపులోకి తీసుకు రావడం.. ఒక్కరికి కూడా చిన్న గాయం కాకుండా రక్షించగలగడం విశేషం. డ్యూటీ ఫ్రీ సైట్ వద్ద కూలింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి.
మధ్యాహ్నం 2 గంటలకు మంటలు చెలరేగాయి. వెంటనే అంటే మధ్యాహ్నం 2.02 గంటలకు అల్ రషీడియా స్టేషన్ నుంచి సివిల్ డిఫెన్స్ బృందాలు మంటల గురించి సమాచారం అందుకున్నాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. అంతే కాదు.. కొద్ది నిమిషాల్లోనే కచ్చితంగా చెప్పాలంటే.. మధ్యాహ్నం 2.16 గంటల కల్లా అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రించగలిగింది. అంతేకాదు ఒక్కరికి కూడా ఎలాంటి ప్రమాదమూ లేకుండా సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు.
దుబాయ్ డ్యూటీ ఫ్రీ తన ఉద్యోగులందరినీ సురక్షితంగా.. సకాలంలో బయటకు తరలించారు. ఈ సంఘటనలో ఏ ఒక్కరికీ ఎటువంటి గాయాలు సంభవించలేదని డ్యూటీ ఫ్రీ యాజమాన్యం తెలిపింది. తక్షణమే స్పందించి మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బందికి డ్యూటీ ఫ్రీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.