శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుళ్లు

  • IndiaGlitz, [Friday,August 21 2020]

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో పేలుళ్లు సంభవించాయి. నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం పాతాళగంగలో ఉన్న ఈ భూగర్భ విద్యుత్తు కేంద్రం ఉంది. దీనిలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. నాలుగవ యూనిట్ టన్నెల్ వద్ద కార్మికులు పనిలో ఉండగా.. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడం.. క్షణాల్లోనే ప్యానల్‌ బోర్డుల్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు వెంటనే టన్నెళ్లకు వ్యాపించడంతో భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి.

ప్రమాద సమయంలో 30 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సహాయక సిబ్బంది ఆరుగురిని రక్షించగా.. 15 మంది సొరంగ మార్గం ద్వారా బయటకు వచ్చేశారు. తొమ్మిది మాత్రం మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. రెండు కిలోమీటర్ల సొరంగంలో జీరో లెవల్‌ నుంచి సర్వీస్‌ బే వరకు దట్టమైన పొగ కమ్ముకు పోయింది. దీంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

జగన్ పర్యటన రద్దు..

ఏపీ సీఎం జగన్ నేడు శ్రీశైలంలో పర్యటించాల్సి ఉంది. శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం సమీక్షా సమావేశాలు నిర్వహించాలని తొలుత సీఎం భావించారు. కానీ ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని జగన్ పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే వారికి అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.