విశాఖ సాల్వెంట్స్ సంస్థలో భారీ అగ్ని ప్రమాదం.. భారీ పేలుళ్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ ప్రమాదాలకు పుట్టినిల్లుగా మారుతోందేమో అనిపిస్తోంది.. ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనలను చూస్తే.. జనం నిద్రలోకి జారుకుంటున్న వేళో.. గాఢ నిద్రలో ఉండగానో జరుగుతున్న ఈ ఘటనలు జనం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవల ఎల్జీ పాలిమర్స్ ఘటన.. ఆ తరువాత సాయినార్ ఘటన.. తాజాగా రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్ ఘటన. రాత్రి 10:35 గంటలకు ఒక్కసారిగా భారీ పేలుడు.. పరవాడ, గాజువాక, లంకెలపాలెం ప్రాంతాలన్నీ ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే దట్టమైన పొగ కమ్మేసింది.
విశాఖపట్నం ఫార్మాసిటీలోని రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్ సంస్థలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆవరణలోనే ఉన్న రసాయన డ్రమ్ములకు అంటుకోవడంతో అవి భారీ శబ్దాలతో పేలిపోయాయి. ఈ పేలుళ్లు 10 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించడంతో స్థానిక ప్రజానీకం భయాందోళనకు లోనైంది. మంటలు దాదాపు 50 అడుగుల మేరకు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టు పక్కల పలు ఫార్మా సంస్థలో విధుల్లో ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విశాఖ సాల్వెంట్స్ సంస్థలో విధుల్లో ఉన్నది నలుగురు మాత్రమే. వారు నలుగురూ గాయపడగా.. వారిలో ఒకరు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ సంస్థ 15 రకాల రసాయనాలను శుద్ధి చేసి ఫార్మా కంపెనీలకు విక్రయిస్తుంటుంది. ఈ క్రమంలోనే సంస్థలో భారీ ఎత్తున రసాయనాలను నిల్వ ఉంచారు. ఇదే ప్రమాద తీవ్రతకు కారణమని భావిస్తున్నారు.
శిథిలాల కింద ఒకరి మృతదేహం..
తొలుత విశాఖ సాల్వెంట్స్ సంస్థలో ప్రమాదం జరిగినప్పుడు నలుగురే ఉన్నారని భావించినప్పటికీ తాజాగా మరొకరు ఉన్నారని నిర్ధారణ అయింది. ఐదో వ్యక్తి మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. సాల్వెంట్ ప్లాంట్ సంఘటనా స్థలంలోని శిథిలా కింద మృతదేహం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.
స్పందించిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి...
విశాఖ సాల్వెంట్స్ ఘటనపై ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. పేలుడుకు గల కారణాలను జిల్లా కలెక్టర్ విజయ్చంద్ను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout