సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి

  • IndiaGlitz, [Thursday,January 21 2021]

ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా(సీఐఐ)కు చెందిన నూతన ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని మేయర్ మురళీధర్ మోహోల్ వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఎస్ఈజెడ్-3 భవనంలోని నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న దాదాపు 10 అగ్నిమాపక ఫైరింజన్లు రంగంలోకి దిగి రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

అయితే భవనంలో ఎందుకు మంటలు చెలరేగాయన్నది ఇంకా పూర్తిగా నిర్ధారణకు రాలేదని మేయర్ మురళీధర్ వెల్లడించారు. జరుగుతున్న వెల్డింగ్ పనుల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తాము భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెల్లడించారు. ఈ ఘటనపై సీరమ్ సంస్థ అధినేత అదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం జరిగిన విషయం తెలుసుకుని బాధపడినట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు అదర్ పూనావాలా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఘటనపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు మోదీ తెలిపారు.