'చంద్రబాబు స్వార్థానికి ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం'
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో లబ్దిపొందేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు రాష్ట్ర ఖజానా ఖాళీ చేసారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు. శనివారం హైదరాబాద్లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై గడికోట నిప్పులు చెరిగారు. ఏపీ ఆర్ధిక వ్యవస్ధను చంద్రబాబు నాశనం చేశారని దుయ్యబట్టారు. మూడున్నర లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని.. ఆ బిల్లులు చెల్లింపుల కోసం సీఎస్ రివ్యూ చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి..? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్టీసీని మూసివేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని.. వైసీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ఆదుకుంటామని ఉద్యోగులకు శ్రీకాంత్ భరోసా ఇచ్చారు.
ఎన్నికల లబ్ధి పొందటానికే ఇదంతా..!
"10 రోజుల్లో ఫలితాలు వస్తుంటే కేబినెట్ మీటింగ్ ఎందుకు?. పెండింగ్ బిల్లులు, భూ సేకరణ కోసమే కేబినెట్ మీటింగ్. గతంలో ఎన్నికల తర్వాత మహానేత వైఎస్ఆర్ ఏ రోజు కేబినెట్ మీటింగ్ పెట్టలేదు. చట్టం ,రాజ్యాంగంపై నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు. డేటాను దొంగిలించిన వ్యక్తులను.. ఈవీఎంలను దొంగిలించిన వ్యక్తులను ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇన్ని రోజులు దాచడం ఎంతవరకు కరెక్ట్? వారిని.. ప్రభుత్వ పెద్దల ఇళ్లలోనే దాచి పెట్టారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ బిల్లులు, పరిశీలనలో ఉన్నటువంటివి 3లక్షల46 వేల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా 3.5 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్రాన్ని బాధ్యతగా నడపాల్సిన చంద్రబాబు ఎలా నిర్వీర్యం చేశారో.. ఎన్నికల లబ్ధి పొందటానికి ఎలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారో..! 3.5 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటే ప్రభుత్వం నడిపే అర్హత చంద్రబాబుకు ఉందా?. రాష్ట్ర శ్రేయస్సు కోసం భూములు ఇచ్చిన వారి గురించి (నిర్వాసితులు) ప్రభుత్వం ఆలోచించటం లేదు. నిర్మాణ రంగంలో తీసుకుంటే 29వేల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. రూ.8,200 కోట్లకు పైగా వివిధ నిర్మాణాలు చేపట్టిన వారికి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది" అని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
చంద్రబాబు అడ్డగోలుగా...
"ఈ పరిస్థితి చూసి ఏప్రిల్ 16న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు ఒక రివ్యూ చేశారు. కొన్ని ప్రాధాన్యత బిల్లులు, అత్యవసర బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ అందులో ఎలాంటి మార్పు రాకపోవటంతో ఏప్రిల్ 23న మళ్లీ అధికారులను పిలిచారు. వివిధ రూపాల్లో బిల్లులు చెల్లించకపోవటమే గాక కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ లో కూడా అలాగే పెండింగ్ లో ఉన్నాయి. రూ.43 వేల కోట్లకు పైగా చెల్లించాల్సిన బిల్లులు చూస్తే.. అంత భారం మనపై ఉంటే.. ఖజానాలో మాత్రం రూ.9,000 కోట్లు మాత్రమే ఉన్నట్లు సీఎస్ తెలియజేయటం జరిగింది. వివిధ బ్యాంకుల నుంచి తాకట్టు పెట్టి తెచ్చిన లోన్లు, ఓవర్ డ్రాఫ్ట్ పై ఆరా తీసిన సీఎస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీసుకువెళ్తున్నారు. ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు తన స్వప్రయోజనాలకు వాడుకోవటం వల్లనే ఈ పరిస్థితి రావటం జరిగింది. గతంలో సీఎఫ్ఎంఎస్ (సెంట్రలైజ్ ఫండ్స్ మేనేజ్మెంట్ సిస్టం) ప్రవేశపెట్టడం జరిగింది. దాని పని చేయకుండా చంద్రబాబు అడ్డగోలుగా ఇన్వాల్వ్ అవ్వటం వల్లనే ఈ పరిస్థితి రావటం జరిగింది. ఫైనాన్స్ వ్యవహారాలకు సంబంధించి గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను, ట్రెజరీని, పీఈఓను చంద్రబాబు డమ్మీ చేశారు. కాంట్రాక్టు బిల్లులు ఎన్నికల్లో ఎవరైతే నిధులు ఇవ్వాలనుకుంటారో వారిదగ్గర చంద్రబాబు పర్సంటేజీలు తీసుకొని వాళ్లకు బిల్లులు వచ్చేలా ఆదేశాలు ఇవ్వటం వల్లనే రాష్ట్రానికి ఈ ఆర్థిక పరిస్థితి వచ్చింది" అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అయితే శ్రీకాంత్ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ముఖ్యంగా చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout