బ్యాంకులపై ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన!
- IndiaGlitz, [Friday,August 30 2019]
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు సంచలన ప్రకటన చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులపై, ఆర్ధిక విధానాలపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 18 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 14 బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయని.. 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి భారత ఆర్ధిక వ్యవస్థను తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను కొనసాగిస్తామని చెప్పారు. దేశంలోని 3 లక్షల 38 వేల కంపెనీలను ఇప్పటికే మూసివేసినట్టు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించినట్టు ఆమె చెప్పారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
రూ. 8.65 లక్షల కోట్ల నుంచి రూ. 7.9 లక్షల కోట్లకు ఎన్.పీ.ఏలను తగ్గించాం
బ్యాంకులు ఇచ్చిన రుణాలను తిరిగి వసూళ్లు చేసే విధానంపై బ్యాంకులు దృష్టిపెట్టాలి
గృహరుణాలు కొంత కఠినంగా ఉండేవి.. ఇకపై వాటిని సరళం చేస్తాం
బ్యాంకులను విలీనం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది.
14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయి
తాజా ప్రకటనతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గనున్నాయి.
ఇదిలా ఉంటే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్‌ను విలీనం చేసి దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏర్పడనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. అంతేకాదు.. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ను కలిపి నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ను కలిపి ఐదో అతిపెద్ద బ్యాంక్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ బ్యాంక్‌ను అలహాబాద్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.