కరోనా నేపథ్యంలో దేశ ప్రజలకు నిర్మలమ్మ శుభవార్త!
- IndiaGlitz, [Tuesday,March 24 2020]
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ వైరస్ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి దేశ ప్రజలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. క్యాష్ విత్‌డ్రాలపై ఆంక్షలను సడలిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇకపై ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసినా ఎటువంటి చార్జీలు ఉండబోవని నిర్మలమ్మ స్పష్టంగా ప్రకటించారు. మూడు నెలల వరకూ ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆమె ఉగాది ముందు తియ్యటి శుభవార్త తెలిపారు. అంతేకాదు.. బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ పరిమితిని కూడా ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు.
అన్నీ గడువులు.. తగ్గింపులే..!
‘కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికే లాక్ డౌన్ చేస్తున్నాం. ఆధార్-పాన్ అనుసంధానం గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నాం. ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ఆర్థిక సంవత్సరం చివరిరోజులు కావడంతో వేగంగా స్పందించాల్సి ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్‌ల దాఖలుకు 2020 జూన్ 30 గడువిస్తున్నాం. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుం 12 నుంచి 9 శాతానికి తగ్గిస్తున్నాం. టీడీఎస్ జమలో ఆలస్య రుసుం 18 నుంచి 9 శాతానికి తగ్గించాలని నిర్ణయించాం. అంతేకాదు.. వివాద్ పే విశ్వాస్ పథకం గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నాం. పన్ను వివాదం మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొలగిస్తున్నాం. మార్చి, ఏప్రిల్, మే మాసాల జీఎస్టీ రిటర్న్‌ల దాఖలు గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నాం. కాంపోజిషన్ స్కీమ్ రిటర్న్‌ల దాఖలుకు కూడా జూన్ 30 వరకు గడువు పెంచాం. ఎగుమతులు, దిగుమతులకు ఊరట కలిగిస్తూ, కస్టమ్స్ క్లియరెన్స్‌ను జూన్ 30 వరకూ నిత్యావసర సర్వీసుగా పరిగణిస్తాం’ అని మీడియా ముఖంగా నిర్మలమ్మ ప్రకటించారు.