Rewind 2022: భారీ అంచనాలతో వచ్చి బోల్తా పడ్డ చిత్రాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రతీ ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ వుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే విజయం సాధిస్తూ వుంటాయి. అయితే వీటిలోనూ ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ అంచనాలు పెంచుకున్న సినిమాలు కూడా వుంటాయి. కానీ ఇవి అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద బొక్క బొర్లాపడుతుంటాయి. స్టార్ హీరోలు వున్నా, హిట్ కాంబినేషన్ అయినా జనం వీటిని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ వుంటారు. 2022లోనూ భారీ అంచనాలతో వచ్చి ఘోరంగా నిరాశపరిచిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
రాధేశ్యామ్:
బాహుబలి సిరీస్, సాహో తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘‘రాధేశ్యామ్’’. సాహో నిరాశపరిచిన నేపథ్యంలో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ప్రభాస్. దీనికి తోడు ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు, ఫస్ట్ లుక్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ కావడంతో అభిమానులంతా దీనిపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ కూడా లైఫ్ అండ్ డెత్‌లా ఐదేళ్ల పాటు కష్టపడ్డారు. అటు నిర్మాతలు కూడా ప్రభాస్ మిత్రులే కావడంతో యూవీ క్రియేషన్స్ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు.
సాహో చేదు అనుభవం మిగిల్చినప్పటికీ... బయ్యర్లు సైతం ప్రభాస్ మీద నమ్మకంతో భారీ రేట్లకు రాధేశ్యామ్ అమ్ముడైంది. చివరికి రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే డివైడ్ టాక్ రావడంతో వారానికే రాధేశ్యామ్ దుకాణం సర్దేసింది. క్లాస్ ఆడియన్స్‌కి తప్పించి మాస్‌ను ఈ సినిమా ఏమాత్రం ఎక్కలేదు. దీంతో బయ్యర్లు నిండా మునిగిపోయారు. స్వయంగా నైజాం ఏరియాలో ఈ సినిమాను రిలీజ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుకు సైతం గట్టి దెబ్బ తగిలింది. ఓవరాల్‌గా ఇండియన్ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
ఆచార్య:
ఈ ఏడాది నిరాశపరిచిన మరో చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య. రీ ఎంట్రీలో ఖైదీ నెంబర్ 150 ఘన విజయం సాధించగా.. తర్వాత చేసిన సైరా నర్సింహారెడ్డి నిరాశపరిచింది. దీంతో మెగా అభిమానులకు ఈసారి ట్రీట్ ఇవ్వాలని చిరు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా అపజయం ఎరుగని కొరటాల శివను దర్శకుడిగా ఎంచుకుని, ఫ్యాన్స్‌కు నచ్చే అన్ని ఎలిమెంట్స్ వుండేలా పక్కాగా ప్లాన్ చేశారు చిరు. దీనికి తోడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గెస్ట్ రోల్ చేయడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
కోవిడ్, లాక్‌డౌన్‌ల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఆచార్య ఎట్టకేలకు ఏప్రిల్ 29, 2022న రిలీజ్ అయ్యింది. అభిమానులకు ఏమాత్రం ఎక్కకపోవడంతో తొలి షో నుంచే కలెక్షన్లు డల్ అయ్యాయి. రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. రూ.76 కోట్లు మాత్రమే తిరిగి రాబట్టి, తెలుగు చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో తమను ఆదుకోవాలని బయ్యర్లు చిరంజీవితో పాటు దర్శక నిర్మాతలపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు.
కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా సినిమా షూటింగ్, రిలీజ్ పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. దీనికే తాము వడ్డీల రూపంలో రూ.50 కోట్ల వరకు చెల్లించామని స్వయంగా చిరు తెలిపారు. అటు ఆచార్య పరాజయంతో దర్శకుడు కొరటాల శివ అందరికీ టార్గెట్ అయ్యారు. చిరంజీవి కూడా తాను కేవలం కథను, దర్శకుడిని నమ్మి ముందుకు వెళ్లానంటూ వ్యాఖ్యానించడంతో వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటూ ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపించాయి.
లైగర్ :
తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిన చిత్రం లైగర్. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. వీరిద్దరిని నిరాశ పరిచింది. విజయ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ వంటి వారు నటించడంతో ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. దీనికి తోడు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో బొమ్మ అదిరిపోతుంతని అంతా భావించారు. తీరా లైగర్ రిలీజైన తర్వాత అందరికీ ఫీజులెగిరిపోయాయి. డివైడ్ టాక్‌తో ఎవ్వరిని ఈ చిత్రం సంతృప్తి పరచలేదు. రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.60 కోట్లను మాత్రమే రాబట్ట గలిగింది.
లైగర్ పరాజయం హీరో విజయ్ దేవరకొండకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ తర్వాత ఆయన ఏ పబ్లిక్ వేదికలోనూ కనిపించలేదంటే అర్ధం చేసుకోవచ్చు. దీనికి తోడు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన పూరి జగన్నాథ్, ఛార్మీలకు ఈడీ కేసులు చుట్టుకున్నాయి. లైగర్‌లో కొందరు రాజకీయ నాయకులు రహస్యంగా పెట్టుబడులు పెట్టారని, హవాలా మార్గంలో నిధులు మళ్లించారని ఈడీ అనుమానిస్తోంది. దీంతో ఇప్పటికే పూరి, చార్మీ, విజయ్ దేవరకొండలను విచారించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com