Indira Devi : మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత.. చిరు, పవన్ , బాలయ్య సంతాపం

సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణంతో టాలీవుడ్‌ దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. ఆమె మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ వివిధ రంగాల ప్రముఖులు కృష్ణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన సంతాపం తెలియజేశారు. ‘‘ ఇందిరా దేవి గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సూపర్‌స్టార్ కృష్ణ గారికి, సోదరుడు మహేశ్ బాబుకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

కృష్ణ గారు, మహేశ్ త్వరగా కోలుకోవాలి :

అటు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇందిరా దేవి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన ద్వారా తన సంతాపం తెలియజేశారు. ‘‘ ప్రముఖ నటులు శ్రీ కృష్ణ గారి సతీమణి, శ్రీ మహేశ్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరా దేవి గారు తుదిశ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేశ్ బాబు గారు త్వరగా కోలుకొనే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.’’ అని పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.

ఇందిరా దేవి మరణం బాధాకరం:

అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఇందిరా దేవి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి, ఘట్టమనేని మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారి మరణం బాధాకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఇందిరాదేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని బాలయ్య తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.