శ్రీ కోదండస్వామి ఆలయ దోషులెవరో తేలే వరకూ పోరాటం: జనసేన

  • IndiaGlitz, [Wednesday,January 13 2021]

పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని శ్రీ కోదండస్వామి ఆలయం మూలవిరాట్ విధ్వంసంపై దోషులెవరో నేటికీ తేలలేదు. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి పోరాటానికి సిద్ధమయ్యారు. దీనికోసం పార్టీ ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని పవన్ నియమించినట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా శ్రీమతి పాలవలస యశస్విని గారు, పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీ గడసాల అప్పారావు గారు, డాక్టర్ బొడ్డుపల్లి రఘులను నియమించారు.

‘‘పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని శ్రీ కోదండస్వామి ఆలయం మూలవిరాట్ విధ్వంసంపై దోషులను నిర్ధారించి దండించే వరకూ బీజేపీతో కలిసి పోరాటం చేయడానికి నలుగురు సభ్యులతో కూడిన కమిటీని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నియమించారు. ఈ కమిటీకి పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ టి. శివశంకర్ గారు నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు శ్రీమతి పాలవలస యశస్విని గారు, పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీ గడసాల అప్పారావు గారు, డాక్టర్ బొడ్డుపల్లి రఘు గారిని నియమించారు.

రామతీర్థంలో స్వామికి అపరచారం జరిగి వారాలు గడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకూ ఎటువంటి పురోగతి లేదు. తమకు స్వేచ్ఛను ఇస్తే ఎటువంటి జఠిలమన కేసునైనా గంటల వ్యవధిలోనే సరిష్కరిస్తామని పోలీసు అధికారులు తరచూ ఆఫ్ ది రికార్డుగా చెబుతుంటారు. మరి ఈ కేసులో పోలీసులకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇవ్వలేదని అనుమానించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ కేసులో సత్వర న్యాయం జరపడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి బృందంతో కలిసి ఈ కమిటీ పని చేస్తుంది. జనసేన కార్యకర్తలకు అవసరమైన సమయాలలో సమాయత్తం చేస్తూ బీజేపీతో సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీ పని చేస్తుంది’’ అని జనసేన వెల్లడించింది.