Israel:ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధ వాతావరణం.. భారతీయులకు కీలక సూచనలు
- IndiaGlitz, [Saturday,October 07 2023]
ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడి భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలియజేసింది. సేఫ్టీ ప్రోటోకాల్స్‌ని పాటిస్తూ భద్రతా శిబిరాల్లోనే ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని ట్వీట్ చేసింది. అందులో భద్రతా మార్గదర్శకాల లింక్‌లు షేర్ చేసింది. మిసైల్ దాడులు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది.
ఇజ్రాయెల్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ..
మరోవైపు ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదుల దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని ట్వీట్ చేశారు. అమాయకులైన బాధితులు, మృతులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఈ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌లో అసలేం జరిగింది..?
పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోని గజా సరిహద్దుల్లో 5వేలకు పైగా రాకెట్లతో ఒక్కసారిగా దాడులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం కూడా ఎదురు దాడులు కొనసాగిస్తోంది. హమాస్ ఉగ్రస్థావరాలపై రాకెట్ దాడులు చేస్తోంది. మరోవైపు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ రోడ్లపై తిరుగుతూ ప్రజలపై భయంకరంగా కాల్పులు జరుపుతున్నారు. మహిళలను వివస్త్రలను చేరి అరాచకం సృష్టిస్తున్నారు. ఈ దాడుల్లో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అటు గజా సరిహద్దుల్లో ఉన్న ఇజ్రాయెల్ సైనిలకు బంధిలుగా చేసుకుని మొకాళ్లపై కూర్చోబెట్టిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హమాస్ ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..
ఈ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రజల్ని ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. హమాస్ ఉగ్రవాదులు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ యుద్ధంలో మనం తప్పకుండా గెలుస్తామని తెలిపారు.