నిజామాబాద్ భాన్సువాడలో 'ఫిదా' సక్సెస్ సంబురాలు
- IndiaGlitz, [Monday,August 14 2017]
ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఫిదా' గురించే హాట్ టాపిక్. తెలంగాణ నేటివిటీని, తెలంగాణ మట్టి వాసనని, తెలంగాణ యాసని కళ్లకు కట్టినట్లుగా చూపించి 'ఫిదా' చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు ప్లెజెంట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. యంగ్ హీరో వరుణ్‌తేజ్, సాయిపల్లవి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మించిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ 'ఫిదా'. ఈ చిత్రం జూలై 21న విడుదలై యునానిమస్‌గా సూపర్‌హిట్ టాక్‌తో విజయదుందుభి మ్రోగిస్తోంది.ఈ సందర్భంగా ఆదివారం నిజామాబాద్ భాన్సువాడలో ఫిదా సక్సెస్ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, మేయర్ ఆకుల సుజాత, గణేష్, హీరో వరుణ్ తేజ్, దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్‌రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, హరీష్ శంకర్, వంశీపైడిపల్లి, లక్ష్మణ్, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.
దిల్‌రాజుకు పౌర సన్మానం, దర్శకుడు అత్మీయ సత్కారం జరిగింది.
ఈ సందర్భంగా..
సత్యం రాజేష్ మాట్లాడుతూ - ''నేను నిజామాబాద్ రావడం ఇదే ఫస్ట్‌టైమ్. ఫిదాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దిల్‌రాజు, శేఖర్‌కమ్ములగారికి థాంక్స్'' అన్నారు.
రాజా మాట్లాడుతూ - ''ఫిదా సినిమా భాన్సువాడలోనే స్టార్ట్ అయ్యింది. ఇంత పెద్ద సక్సెస్‌ను భాన్సువాడలోనే సెలబ్రేట్ చేసుకుంటే దానికి పరిపూర్ణత వస్తుందనిపించింది. అందుకే టీం అంతా ఇక్కడకు వచ్చాం'' అన్నారు.
ఆకుల సుజాత మాట్లాడుతూ - ''ఒక వారం క్రితం ఫిదా సినిమా చూశాను. నాకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఫిదా సినిమా చాలా చక్కగా ఉంది. అచ్చమైన తెలుగు భాషలో సినిమా చేశారు. నిజామాబాద్ వాసి దిల్‌రాజుగారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆయనకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. హీరో హీరోయిన్లు చక్కగా నటించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి'' అన్నారు.
గణేష్ మాట్లాడుతూ - ''ఒకప్పుడు సినిమాలంటే భీమవరం, విజయవాడ, పాలకొల్లు అంటూ వేరే నేపథ్యాల్లో నడిచేది. దిల్‌రాజు నిజామాబాద్ వాస్తవ్యుడు. శేఖర్ కమ్ములగారు మా జిల్లాలో ఎంత అందంగా సినిమా తీయవచ్చో చూపించాడు. ఫిదా సినిమా చూసినప్పుడు వరుణ్, సాయిపల్లవి ఇక్కడే పుట్టి పెరిగారనేలా నటించారు. దిల్‌రాజు, శేఖర్‌కమ్ములగారికే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ దక్కుతుంది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ - ''సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడిన విధానం చూస్తే తెలంగాణ అమ్మాయిలు అగ్గిలా ఉంటారని అర్థమైంది. సినిమా చూసి గర్వంగా అనిపించింది. దిల్ ఉన్న రాజు ఏ సినిమా తీసినా సక్సెస్ సాధిస్తున్నాడు. ఆయన మా జిల్లాకు చెందినవాడు కావడం హ్యాపీ. శేఖర్ కమ్ములగారికి అభినందనలు. నేను చిరంజీవిగారికి ఫ్యాన్‌ని. ఆయన తమ్ముడి కుమారుడు వరుణ్ ఈ సినిమాలో చక్కగా నటించాడు. సాయిపల్లవి తెలంగాణ యాసను చక్కగా పలికింది. ఫిదా యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను'' అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ''తెలంగాణ సినిమా తీయడంతో జన్మధన్యమైనట్లు భావిస్తున్నాను. భాన్సువాడకు రావడం ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది. అందరికీ థాంక్స్'' అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ - ''మా ఫిదా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్. సినిమాలోనటించే అవకాశం ఇచ్చినందుకు శేఖర్‌కమ్ముల, దిల్‌రాజుగారికి థాంక్స్'' అన్నారు.