Fidaa Review
ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు శేఖర్ కమ్ముల సుపరిచితుడే. మంచి ఫీల్‌తో సినిమాలు తీయడంలో శేఖర్ కు ఒక శైళి ఉంది. అనామిక సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా `ఫిదా`. ఆనంద్ తర్వాత ఆ రేంజ్‌లో ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన ప్రేమకథను చేయలేదు. కాలేజీ కుర్రాళ్ళ కథలతో పాటు లీడర్ వంటి పొలిటికల్ మూవీని తెరకెక్కించాడు. చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల చేసిన లవ్ స్టోరీ ఈ `ఫిదా`. మరి ఈ చిత్రంలో ఎవరిని చూసి ఎవరు ఫిదా అయ్యారు? అసలు ప్రేక్షకులను శేఖర్ తనదైన శైళితో ఫిదా చేశాడా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం.
కథ:
వరుణ్(వరుణ్‌తేజ్), రాజు(రాజా) అన్నదమ్ములు. యు.ఎస్‌లో నివసిస్తుంటారు. వీరితో పాటు ఓ చిన్న పిల్లవాడు కూడా ఉంటాడు. వరుణ్ మెడిసిన్ చదువుతుంటాడు. రాజు బిజినెస్ చేస్తుంటాడు. రాజుకి పెళ్లి చేస్తే బావుంటుందని వరుణ్, తనని భాన్సువాడకు పంపుతాడు. భాన్సువాడకు వచ్చిన రాజు అక్కడ పెళ్లి కూతురుని చూసి ఇష్టపడతాడు. కానీ సెకండ్ ఓపినియన్ కోసం తమ్ముడిని రమ్మంటాడు. వరుణ్ కూడా బాన్సువాడ వస్తాడు. రాజు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఓ చెల్లెలు ఉంటుంది. ఆమె పేరు భానుమతి(సాయిపల్లవి). భానుమతి చాలా యాక్టివ్ పర్సన్. మనసులో ఏదీ దాచుకోదు. తండ్రి(సాయిచంద్) అంటే తనకు ప్రాణం. అక్క పెళ్లికి వచ్చిన వరుణ్‌ను భానుమతి ఇష్టపడతుంది. తన ప్రేమను చెప్పాలనుకుంటుంది. కానీ కొన్ని సమస్యలు కారణంగా వరుణ్‌ను అపార్థం చేసుకుని విడిపోతుంది. వరుణ్ యు.ఎస్ వెళ్ళి భానుమతికి ఐలవ్‌యూ చెప్పిన అంగీకరించదు. ఆ సమయంలో ఓ కారణంగా భానుమతి యు.ఎస్ రావాల్సి వస్తుంది. అసలు ఆ కారణమేంటి? వరుణ్, భానుమతి ప్రేమకథ సుఖాంతం అయ్యిందా లేదా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
ప్లస్ పాయింట్స్:
సినిమాలో నటీనటుల విషయానికి వస్తే..హీరో వరుణ్‌తేజ్ వరుణ్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. అమెరికా మెడిసిన్ చదువుతూ అక్కడే ఉండే యువకులు ఎలా బిహేవ్ చేస్తారో అలా తను బిహేవ్ చేశాడు. ఎక్కడా హీరోయిజం కనపడదు. ఇక సినిమాల్లో సందర్భానుసారం వచ్చే ఓ ఫైట్ ఉంది. డ్యాన్సులు గురించి శేఖర్ కమ్ములసినిమాలో మాట్లాడుకోవడానికి స్కోప్ ఉండదు. బాన్సువాడ పరిసరాలు పచ్చపచ్చగా చూడ్డానికి కనువిందుగా అనిపించాయి. అమెరికాలోని లొకేషన్లు కూడా బావున్నాయి. కాస్ట్యూమ్స్ కూడా చూడచక్కగా అనిపించాయి. సీతారామశాస్త్రిగారి అబ్బాయి రాజు తన పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్ తండ్రిగా నటించిన సాయిచంద్‌గారు, మేనత్త పాత్రలో నటించి గీత భాస్కర్‌గారు వారి వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. ఇక మెయిన్‌గా చెప్పుకోవాల్సిన పాత్ర సాయిపల్లవి. సినిమాలో సాయిపల్లవి నటన, డైలాగ్స్ చూస్తే తను మలయాళీ హీరోయిన్ అని ఎవరూ అనుకోరు. తను తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పిన తీరు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకు తను మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా కథలో కొత్తదనం అంటూ ఎక్కడా చూపించలేదు. ఓ ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాను నడిపించాడు. ఇద్దరు ప్రేమికులు మధ్య ఎలాంటి కోపాతాపాలుంటాయనే దాన్ని చక్కగా ఎలివేట్ చేశాడు. విజయ్‌సి.కుమార్ సినిమాటోగ్రఫీ బావుంది. భాన్సువాడ అందాలన తన కెమెరాలో చక్కగా బంధించారు. శశికాంత్ ట్యూన్స్ బావున్నాయి. వచ్చిండే ..పాట, మనసు ఊసుపోదు... సహా పాటలన్నీ సందర్భానుసారం కథలో భాగంగా రావడంతో ఎక్కడా బోర్ కొట్టదు.
మైనస్ పాయింట్స్:
సినిమా చూడ్డానికి బాగానే ఉన్నా, సెకండాఫ్ సాగదీతగా ఉంది. ఫస్టాఫ్ కాస్త వేగంగానే సాగినట్టు అనిపించచినా మలి సగం మాత్రం కాస్త భారంగానే నడుస్తుంది. కథలో ఏ సన్నివేశమూ కొత్తగా అనిపించదు. ప్రతిదీ మనం ఇంతకు మునుపు ఇంకేదో సినిమాలో చూసినట్టే అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా సందర్భాల్లో వీక్‌గా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బలంగా ఎక్కడా హత్తుకోవు. హీరోయిన్ అక్క పాత్రలో కాసింత తెలిసిన నటిని పెట్టి ఉంటే బావుండేది.
విశ్లేషణ:
శేఖర్ తన స్టైల్‌లోనే ఫిదా సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో మంచి ఫీల్ ఉంటుందే తప్ప, కొత్త కథను చెప్పడం లేదని ముందుగానే చెప్పేశాడు. మంచి నటీనటులను ఎంపిక చేసుకున్నాడు. సినిమాలో నేచురాలిటికీ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. హీరో హీరోయిన్స్ పెర్‌ఫార్మెన్స్ మెప్పించేలా తెరపై కథ సాగుతుంది. అన్నదమ్ముల అనుబంధాలు, తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న బంధం, అక్కచెల్లెళ్ల ఆత్మీయత.. మనసులో ఉన్న విషయాన్ని సరిగా వ్యక్తం చేయలేని పక్షంలో ఎదుర్కోవాల్సి వచ్చే ఇబ్బందులు, క్షణికావేశాల్లో తీసుకున్న నిర్ణయాల తాలూకు ప్రభావాలు.. ఒకటేంటి వంద రకాల విషయాలను క్యారీ చేశాడు శేఖర్ కమ్ముల. కాకపోతే సెకండాఫ్ కాసింత ల్యాగ్ ఎక్కువగా అనిపించడం, సినిమాలో కొత్తగా చెప్పుకోదగ్గ అంశాలు లేకపోవడం అన్నది మాత్రం కాసింత నిరాశకు గురిచేసే విషయం.
బోటమ్ లైన్: ఫిదా...శేఖర్ కమ్ముల పంథాలో సాగే మంచి ప్రేమకథ
Fidaa Review in English
- Read in English