'ఫిదా' సంబరాలు
- IndiaGlitz, [Friday,July 28 2017]
యంగ్ హీరో వరుణ్‌తేజ్, సాయిపల్లవి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మించిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ 'ఫిదా'. ఈ చిత్రం జూలై 21న విడుదలై యునానిమస్‌గా సూపర్‌హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సినిమా సక్సెస్ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో సక్సెస్ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మెగా బ్రదర్ నాగబాబు, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాయిపల్లవి, దర్శకుడు శేఖర్ కమ్ముల, సంగీత దర్శకుడు శక్తి కార్తీక్, జె.బి, నటుడు సాయిచంద్, రాజు, శరణ్య, గీత, సత్యం రాజేష్, గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, వనమాలి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
సినిమాలో కంటెంట్ నమ్మే నిర్మాత దిల్‌రాజు
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ - ''సినిమాలు నెమ్మది నెమ్మదిగా జనాలకి ఎక్కుతాయి అనే రోజులు పోయాయి. ఇప్పుడు ఏ సినిమా అయినా ఫస్ట్ షోకే తెలిసిపోతుంది.అలా ఫస్ట్ షోకే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'ఫిదా'. ఒక పల్లెటూరు వాతావరణంలో, నేటివిటీ మిస్ అవకుండా పచ్చని పొలాలు తీశారు శేఖర్ కమ్ముల. సినిమా చూసిన వారందరూ ఒక మంచి సినిమా చూసి సంతోషంగా బయటికి వస్తున్నారు. శేఖర్ కమ్ముల కెరీర్‌లో 'ఫిదా' బెస్ట్ సక్సెస్ అని ఫీలవుతున్నాను. ఈమధ్య వరుసగా దిల్ రాజు సక్సెస్‌లు సాధిస్తున్నారు. అతన్ని చూస్తే ఈర్ష్య కలుగుతుంది. ఆయనకి వారి శ్రీమతి అనిత ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి. కంటెంట్ ఈజ్ ద కింగ్. స్టార్ కాంబినేషన్ కాకుండా కంటెంట్‌ని నమ్మి చాలా గొప్ప సినిమాలు తీస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. నాగబాబు ఫ్యామిలీలో సక్సెస్ వస్తే మా అందరికీ చాలా ఆనందంగా వుంటుంది. వరుణ్ ఈ సినిమాలో చాలా నేచురల్ పెర్‌ఫార్మెన్స్ చేశాడు. చాలా ముద్దు వస్తున్నాడు. ఇప్పుడు నేచురల్‌గా చేసే ఆర్టిస్ట్‌లలో వరుణ్ ఒకరు. సాయి పల్లవి గ్రేట్ టాలెంట్ కలిగిన ఆర్టిస్ట్. మంచి డ్యాన్సర్ కూడా. ఈ సినిమా అంతా తన షోల్డర్‌పై వేసుకొని బాగా క్యారీ చేసింది. సాయిచంద్ తండ్రి పాత్రలో అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, మెగా అభిమానులకి థాంక్స్'' అన్నారు.
తెలంగాణ చరిత్రను దేశ విదేశాలకు చాటిన చిత్రం
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ - ''తెలంగాణ మట్టి వాసనని, సంస్కృతిని దేశ విదేశాలకు చాటి చెప్పిన చిత్రం 'ఫిదా'. ఇంత అద్భుతమైన సినిమాని తెరకెక్కించిన శేఖర్ కమ్ములకి హ్యాట్సాఫ్. తెలంగాణలో హృషికేశ్, గుల్జర్‌లాంటి ఒక గొప్ప దర్శకుడు వచ్చాడు. డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్, నిర్మాతగా వరుస సక్సెస్‌లు సాధిస్తున్న దిల్ రాజుగారికి నా ధన్యవాదాలు. ఈ సినిమాకి పని చేసిన టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ - ''మంచి హిట్ సినిమా తీసిన నిర్మాత దిల్ రాజుని ఫస్ట్ అప్రిషియేట్ చేస్తున్నాను. దిల్ రాజు లేకపోతే ఈ సినిమా హిట్ అయ్యేది కాదు. కథను నమ్మి ప్యాషన్‌తో, ఇష్టంతో ప్రతి విషయంలో ఇన్‌వాల్వ్ అయి ప్రొఫెషనల్‌గా ఈ సినిమా తీశారు. హ్యాట్సాఫ్ దిల్ రాజు. ఆదుర్తి సుబ్బారావు, కె.విశ్వనాథ్, బాపుల తర్వాత గోదావరి అందాల్ని, విలేజ్ నేటివిటీని అందంగా చూపించే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన ఏ సినిమా చేసినా మనసు పెట్టి తీస్తాడు. సాయిచంద్ ఫాదర్ క్యారెక్టర్ ఎక్స్‌లెంట్‌గా చేశారు. సినిమాలో అంతా కొత్త వాళ్లే నటించారు. అందుకే చాలా కొత్తగా, ఫ్రెష్‌గా అన్పిస్తుంది. శక్తి కార్తీక్ అదిరిపోయే సాంగ్స్ చేశారు. జె.బి. సూపర్ రీరికార్డింగ్ చేశారు. సాయి పల్లవి భానుమతి క్యారెక్టర్ అద్భుతంగా చేసింది. సినిమా చూస్తున్నంత సేపు ఆ క్యారెక్టర్‌లో లీనమైపోయాం. 'మిస్సమ్మ'లో సావిత్రిలా 'ఫిదా'లో సాయి పల్లవి అంత అద్భుతంగా చేసింది. వరుణ్ చాలా నేచురల్‌గా యాక్ట్ చేశాడు. ఈ సినిమాకి వర్క్ చేసిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాట్స్'' అన్నారు.
మంచి అనుభూతుల్ని మిగిల్చిన సినిమా
సాయిచంద్ మాట్లాడుతూ - ''ఫిదా' నా జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. హీరోగా నేను ఎన్నో సినిమాలు చేశాను. కానీ నాకు ఇష్టమైన అన్నపూర్ణ, విజయ సంస్థల్లో పని చేయలేదు. 'మిస్సమ్మ', 'గుండమ్మ కథ'లాంటి గొప్ప చిత్రాల్లో నేను వర్క్ చేయలేదే అనే ఫీలింగ్ మిగిలిపోయింది. ఆ కోరిక 'ఫిదా'తో తీరిపోయింది. ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్ దేశ విదేశాల నుండి చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి. నాకు ఈ సినిమా చాలా అనుభూతుల్ని మిగిల్చింది. ఈ సినిమాకి 'ఫిదా' అయ్యాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన శేఖర్ కమ్ముల, దిల్ రాజుగారికి నా థాంక్స్'' అన్నారు.
టీమ్‌కు థాంక్స్
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ''ఈ సినిమా ఆత్మ తెలంగాణ. జానపదాలు, బతుకమ్మ పాటలు చిన్నప్పుడు నుండి వినేవాడిని. తెలంగాణ యాస అన్నా, భాష అన్నా చిన్నప్పటి నుండి ఇష్టం. ఈ సినిమాకి గుండెకాయ సాయి పల్లవి. తెలంగాణ భాష నేర్చుకుని ఓన్‌గా డబ్బింగ్ చెప్పింది. వరుణ్ చాలా నేచురల్‌గా క్యారెక్టర్‌కి తగ్గట్లు పెర్‌ఫార్మ్ చేశాడు. విజయ్ సి. కుమార్, మార్తాండ్ కె.వెంకటేష్, నేను ముగ్గురం ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ సినిమా చేశాం. ఇది శేఖర్ కమ్ముల ఫిలిం అని నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చిన దిల్ రాజుగారికి నా థాంక్స్. శక్తి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. జె.బి. తన ఆర్.ఆర్‌తో సినిమాని నెక్స్‌ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఈ సినిమాలోని మెస్సేజ్ అందరికీ కనెక్ట్ అయ్యింది. నాకు సహకరించిన ఆర్టిస్ట్‌లకి, టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు'' అన్నారు.
సినిమా చూసినవారందరూ ఎంజాయ్ చేస్తున్నారు
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - ''ఫిదా' సినిమా సెన్సేషన్ అయ్యింది. ప్రేక్షకులకి థాంక్స్ తెలపడానికి 'ఫిదా' సంబరాలు స్టార్ట్ చేశాం. ఇది ఇంకా కంటిన్యూగా సాగుతుంది. నేను ఫారిన్‌లో వున్నప్పుడు రిలీజ్‌కి ముందే శేఖర్ కమ్ముల, మార్తాండ్ కె.వెంకటేష్ ఫీల్ గుడ్ మూవీ చాలా బాగా వచ్చింది అని నాకు మెస్సేజ్ పెట్టారు. వచ్చిన తర్వాత నాగబాబు, అరవింద్‌గారి ఫ్యామిలీకి షో వేశాం. సినిమా చూసి చాలా బాగుంది అన్నారు. 'బొమ్మరిల్లు' టైమ్‌లో కడప నుండి సినిమా సూపర్‌హిట్ అని కాల్ వచ్చింది. ఇప్పుడు నెల్లూరు నుండి వచ్చింది. 'ఫస్ట్ షో చూసినప్పుడే 'ఫిదా' బ్లాస్ట్ అవుతుందని ఫీలయ్యాం. ప్రపంచవ్యాప్తంగా 'ఫిదా'ని సూపర్‌హిట్ చేశారు ప్రేక్షకులు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మా ప్రతి సినిమాలో నేను ఇన్‌వాల్వ్ అవుతాను. ఈ ఫిలింకి నా ఇన్‌వాల్వ్‌మెంట్ లేదు. ఇది శేఖర్ కమ్ముల ఫిలిం. వరుణ్ చాలా నేచురల్‌గా యాక్ట్ చేసి అందరి మన్ననలను పొందుతున్నాడు. సాయి పల్లవి చేసిన భానుమతి క్యారెక్టర్‌ని అందరూ ఓన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు'' అన్నారు.
భానుమతి క్యారెక్టర్ లేకపోతే 'ఫిదా' లేదు
హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ - ''ఫిదా' సక్సెస్ సంబరాలు చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఏదైనా సినిమా హిట్, ఫ్లాప్‌లు సహజం. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులు ఓన్ చేసుకుని రిపీటెడ్‌గా చూస్తారు. సాయి పల్లవి క్యారెక్టర్‌కి చాలా మంచి అప్లాజ్ వస్తోంది. ఈ చిత్రంలో భానుమతి క్యారెక్టర్ లేకపోతే 'ఫిదా' లేదు. ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తున్నారు. మంచి సినిమాలు వస్తే మేము ఆదరిస్తామని ప్రేక్షకులు 'ఫిదా'తో మరోసారి ప్రూవ్ చేశారు'' అన్నారు.
సక్సెస్ క్రెడిట్ వారిదే..
హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ - ''ఈ సక్సెస్ క్రెడిట్ అంతా మా టీమ్‌కే చెందుతుంది. ఫస్ట్ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా వుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్ముల, దిల్ రాజుగారికి నా థాంక్స్'' అన్నారు.