థియేటర్స్ ఆక్యుపెన్సీ.. కేంద్రానికి లేఖ రాసిన ఎఫ్ఎఫ్ఐ
- IndiaGlitz, [Saturday,January 09 2021]
పండగలు వచ్చేస్తున్నాయి. కానీ కోవిడ్ ప్రభావం నుండి థియేటర్స్‌కు ఇంకా విముక్తి దొరకడం లేదు. యాబై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ రన్ అవుతున్నాయి. బాబాయ్ పండగలు కదా.. వంద శాతం ఆక్యుపెన్సీ ఎందుకు ఇవ్వడం లేదు.. ఇవ్వండి సార్.. అంటూ సినీ పరిశ్రమలు ముఖ్యమంత్రులను కోరుతున్నారు. తమిళనాడు వంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వంద శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇచ్చినా, కేంద్రం మోకాలడ్డుతుంది. కోవిడ్ ప్రభావం తగ్గక ముందు థియేటర్‌లో వంద శాతం ఆక్యుపెన్సీ ఇస్తే కోవిడ్ ప్రభావం పెరిగే అవకాశం ఉందని కేంద్రం చెబుతోంది. అందుకనే తమిళనాడుకి వంద శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు కూడా వెనక్కి తగ్గింది.
అయితే బస్సులు, రైళ్లు ఇతర ప్రాంతాల్లో లేని సమస్య థియేటర్స్‌లో ఎందుకు వస్తుంది. మేం తగు జాగ్రత్తలు తీసుకుంటాం.. దయచేసి పర్మిషన్ ఇవ్వండి అంటూ కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరపును అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను లేఖ రాశాడు. మరి వీరి విన్నపాన్ని కేంద్ర హోం శాఖ పట్టించుకుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. పశ్చిమ బెంగాల్ గురించి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..కేంద్రం లేదు, ఏమీ లేదు. మీరు వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ను రన్ చేసుకోండి అంటూ నిర్మాతలకు ఆదేశాలను జారీ చేసింది. థియేటర్స్ ఆక్యుపెన్సీ విషయంలో నువ్వా నేనా అంటూ ఒకవైపు కేంద్రం, పశ్చిమ బెంగాల్ రాజకీయ వైరాన్ని చాటుకుంటున్నాయి. మరో వైపు నిర్మాతలు బేలగా చూస్తున్నారు.