తనికెళ్ళ భరణి సన్మాన వేడుక.. ఆకట్టుకునేలా రామ్ గోపాల్ వర్మ, పురాణపండ స్పీచ్
Send us your feedback to audioarticles@vaarta.com
తనికెళ్ళ భరణి.. కేవలం తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా సుపరిచితులు. పండితులకీ, పామరులకీ కూడా తనికెళ్ళ భరణి 'ఆటకదరా శివా' అంటే చాలా ఇష్టం. అంతలా ప్రాచుర్యం పొందిన తనికెళ్ళ భరణికి ఇటీవల వరంగల్‌కి చెందిన ఎస్.ఆర్. విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా లభించిన సంగతి తెలిసిందే.
ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న తనికెళ్ళ భరణికి హైదరాబాద్ రవీంద్ర భారతిలో సంగమ్ సంస్థ రధసారధి సంజయ్ కిషోర్ సారధ్యంలో ఘన సత్కార వేడుక జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ, ‘శంకరాభరణం’ ఫేం నటి, ప్రముఖ నాట్యకారిణి మంజుభార్గవి, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాం గోపాల్ వర్మ మాట్లాడుతూ భరణి మానవ విలువల ఆత్మీయతను, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భరణికి ఎప్పుడో డాక్టరేట్ వస్తుందని అనుకున్నానని.. కానీ ఇన్నాళ్ళకు రావడంతో తనకి ఆశ్చర్యం కలిగిందని వర్మ అన్నారు.
ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ అనురాగపూరితమైన మంగళ శివ స్పర్శ తనికెళ్ళ భరణిగా అభివర్ణించారు. తనికెళ్ళ భరణి మాటల్లో, ప్రవర్తనలో, రచనల్లో ఆత్మబంధమే కానీ ముసుగులుండవనీ.. ఎంతోమందికి ధైర్యం చెప్పి బ్రతుకుల్ని పెంచిన ఆత్మీయతల ఆలంబనగా భరణి దర్శనమిస్తారని పురాణపండ అన్నారు.
నటి మంజు భార్గవి మాట్లాడుతూ.. తనికెళ్ళ భరణి మాటలన్నా, ఆయన కవిత్వమన్నా తనకి చాలా ఇష్టమని అన్నారు. ప్రఖ్యాత కవి, రచయిత సుద్దాల అశోక్ తేజ ఈరోజు తాను ఈ స్థాయికి రావడానికి తనికెళ్ళ భరణి ప్రోత్సాహం బలంగా ఉందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు ప్రముఖులు తనికెళ్ళ భరణిపై ప్రశంసల వర్షం కురిపించారు. సన్మానం అందుకున్న భరణి తన ప్రసంగంలో.. రామ్ గోపాల్ వర్మ ఈ సభకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సన్మాన సభలో పాల్గొని తనని అభినందించిన అందరినీ పేరుపేరునా ప్రస్తావిస్తూ తనికెళ్ళ భరణి ధన్యవాదాలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments