మళ్లీ లాక్‌డౌన్ భయం.. ఇంటి బాట పడుతున్న వలస కూలీలు
Send us your feedback to audioarticles@vaarta.com
మాయదారి కరోనా రెట్టింపు వేగంతో విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది లక్ష కేసులంటేనే జనం భయపడ్డారు. అలాంటిది ఇప్పుడు రెండు లక్షలకు పై చిలుకు కేసులతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరి ఈ రేంజ్‌లో కరోనా విస్తరిస్తుంటే లాక్‌డౌన్ విధిస్తారన్న వార్త సైతం దేశ వ్యాప్తంగా దావానలంలా విస్తరిస్తోంది. లాక్‌డౌన్ విధించే ప్రశ్నే లేదంటూ ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతున్నప్పటికీ సామాన్యుల్లో మాత్రం లాక్‌డౌన్ భయం వీడట్లేదు. ఈ క్రమంలోనే మళ్లీ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకూ వలసకూలీలతో కళకళలాడిన అడ్డాలు, నిర్మాణ స్థలాలు, పరిశ్రమలు మళ్లీ బోసిపోతున్నాయి.
గత ఏడాది మార్చి 16 నుంచి రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ పూర్తిగా స్తంభించాయి. దీంతో పొరుగు రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్ర ఒడిసా, బిహర్, ఛత్తీస్‌గడ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షల మంది వలస కూలీలు పనులు లేక.. చేతిలో చిల్లి గవ్వ లేక అల్లాడిపోయారు. ఈ క్రమంలో కొంతమంది మంది కాలినడకన స్వగ్రామాలకు వెళ్లగా, మరికొందరు శ్రామిక్ రైళ్లలో తరలివెళ్లారు. నాటి భయంకర దృశ్యాలను వలస కూలీలు ఎప్పటికీ మరచిపోలేరు. అలాంటిది ఏడాది తిరక్కుండానే తిరిగి అలాంటి పరిస్థితినే ఎదుర్కోవాల్సి వస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన వలస కూలీల్లో పెరిగిపోయింది. దీంతో సొంతూళ్ల బాట పడుతున్నారు.
మరోవైపు కరోనా రోగుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఊహించని రీతిలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఏప్రిల్ 1కి.. నేటికి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. పరిస్థితికి అనుకూలంగా అధికారులు సైతం బెడ్ల సంఖ్యను పెంచుతున్నప్పటికీ అవి కూడా సరిపోవడం లేదు. ఒకవైపు తెలంగాణలోని వారి పరిస్థితే ఇబ్బందికరంగా ఉందంటే.. బెడ్ల కోసం పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments