MS Swaminathan : భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
భారత హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో గురువారం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. స్వామినాథన్ వయసు 98 సంవత్సరాలు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
ఇది స్వామినాథన్ ప్రస్థానం :
1925 ఆగస్ట్ 7న నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు స్వామినాథన్. తండ్రి ఎంకే సాంబశివన్ సర్జన్ కావడంతో ఆయన బాటలోనే మెట్రిక్యులేషన్ పూర్తయిన వెంటనే మెడికల్ స్కూల్‌లో చేరారు స్వామినాథన్. ఈ దశలో 1943 ప్రాంతంలో బెంగాల్ ప్రాంతంలో చోటు చేసుకున్న తీవ్రమైన కరువు స్వామినాథన్‌ను తీవ్రంగా కలచివేసింది. దేశ ప్రజలు ఆకలి బాధను అనుభవించకూడదనే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో పరిశోధనలకు తన జీవితాన్ని అంకితం చేశారు. తిరువనంతపురంలోని మహారాజా కాలేజీలో జువాలజీలో డిగ్రీ చేసి ఆయన.. అనంతరం మద్రాస్ అగ్రికల్చరల్ కాలేజీల్ చేరారు. అక్కడ అగ్రికల్చరల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలోని ప్రఖ్యాత భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ)లో పీజీ అభ్యసించారు.
విద్యాభ్యాసం తర్వాత సివిల్స్ పరీక్షలు రాసిన స్వామినాథన్ ఐపీఎస్‌కు అర్హత సాధించారు. అయినప్పటికీ ఆ అత్యున్నత హోదాను వదులుకుని యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆలూగడ్డ జన్యుపరిణామంపై పరిశోధనలు చేశారు. తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో చేరి పీహెచ్‌డీ పూర్తి చేశారు. కొద్దికాలం అక్కడ పనిచేసిన స్వామినాథన్ 1954లో తిరిగి భారతదేశానికి వచ్చారు. అనంతరం తాను చదువుకున్న ఐఏఆర్ఐలోనే శాస్త్రవేత్తగా చేరారు.
1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1987లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. భారతదేశంలో ఆహోరోత్పత్తి పెరిగేందుకు తన జీవితాంతం ఎంతో కృషి చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం సత్కరించింది. అలాగే వ్యవసాయ రంగంలో నోబెల్‌గా చెప్పుకునే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ స్వామినాథన్‌ను వరించింది. దీనితో పాటు రామన్ మెగసెస్సే, అల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డ్, ఇందిరాగాంధీ శాంతి బహుమతిని స్వామినాథన్ అందుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments