Fashion Designer Review
సినిమాల్లో గోదావరి అందాలను అందంగా చూపించే దర్శకుడెవరంటే ఎవరికైనా చటుక్కున గుర్తుకొచ్చే పేరు డైరెక్టర్ సీనియర్ వంశీ. ఆయన రాసుకున్న పసలపూడి కథలైనా, సినిమా కథల్లో ఎక్కువ భాగం గోదారి తీరానికే సంబంధించి ఉంటాయి. ఆయన వేరే జోనర్ సినిమాలు తీసినా గోదావరి తీరంలో ఓ స్టెప్ అయినా ఉండేలా చూసుకోవడం వంశీకి అలవాటు. డైరెక్టర్ వంశీకి గోదావరి అంటే అంత ఇష్టం. అలా 1986లో గోదావరి సమీపంలో ఓ గ్రామంలో లేడీస్ టైలర్ సుందరంను తెరపై ఆవిష్కరిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. లేడీస్ టైలర్ ఓ క్లాసిక్ మూవీ అయ్యింది. వంశీ సినిమాలను ఇష్టపడే అభిమానుల్లో ఒకడైన నిర్మాత మధురశ్రీధర్ ఈ క్లాసిక్‌కు ఇరవై యేళ్ళ తర్వాత సీక్వెల్ రూపొందించాలని నాలుగేళ్ళ పాటు కష్టపడి ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ చిత్రాన్ని రూపొందించారు. మరి తండ్రి లేడీస్ టైలర్‌లా కొడుకు ఫ్యాషన్ డిజైనర్ ప్రేక్షకుల ఆదారాభిమానాలను పొందాడా లేదో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
గోదావరి నదీ తీరంలోని ఓ గ్రామంలో లేడీస్ టైలర్ సుందరం తనయుడు గోపాలం(సుమంత్ ఆశ్విన్) తన మేనమామ పాపారావు, తన తండ్రి స్నేహితుడైన బట్టల సత్తి కొడుకు పండు(రాఘవేంద్ర)తో నివసిస్తుంటాడు. తండ్రిలా కాకుండా తాను ఎలాగైనా నర్సాపూర్‌లో ఓ పెద్ద టైలరింగ్ కంపెనీ స్టార్ట్ చేసి ఫ్యాషన్ డిజైనర్ అయిపోవాలని కలలు కంటుంటాడు. అరదుకోసం మంచి డబ్బున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనేది గోపాలం ఆలోచన. అదే గ్రామంలో ఉండే గవర్రాజు ఎవరైఆన అమ్మాయిలకు ద్రోహం చేసినట్లు తెలిసినా, తన మేనకోడలు అమ్ములు (మనాలి రాథోడ్) జోలికి ఎవరైనా వస్తే చంపేస్తుంటాడు. గోపాలానికి గవర్రాజు అంటే చాలా భయం. ఇలాంటి సమయంలో ఓ జ్యోతిష్కుడు గోపాలం చేతిలో మన్మథరేఖ ఉందని, తాను తలుచుకుంటే ఏ అమ్మాయినైనా ప్రేమలో పడేయగలడని అంటాడు. దాంతో గోపాలం ధైర్యం చేసి తన ఆలోచనకు శ్రీకారం చుడుతాడు. ఊర్లో డబ్బున్న అమ్మాయిలు లిస్టు తీస్తాడు. ముందుగా గేదెల రాణి(మానస)ని ముందు తన ప్రేమలో పడేలా చేసుకుంటాడు. తర్వాత గవర్రాజు మేనకోడలు అమ్ములు(మనాలి రాథోడ్)కు బాగా డబ్బుందని తెలిసి ఆమెను కూడా తన ప్రేమలో పడేలా చేసుకుంటాడు. చివరకు అమెరికా నుండి పల్లెటూరికి వచ్చిన మహాలక్ష్మి(అనీషా అంబ్రోస్)కు రాణి, అమ్ములు కంటే ఇంకా ఎక్కువ డబ్బుందని తెలిసి ఆమెను ప్రేమను పొందాడానికి ప్రయత్నం చేస్తుంటాడు. చివరకు మహాలక్ష్మిని ప్రేమించిన గోపాలం విషయం రాణి, అమ్ములుకు తెలిసిపోతుంది. దాంతో కథ అనుకోని మలుపు తీసుకుంటుంది. గోపాలం ప్రమాదంలో పడతాడు. అప్పుడు గోపాలం ఏం చేస్తాడు? గోపాలాన్ని ప్రమాదం బారి నుండి ఎవరు కాపాడుతారు? మేనకోడలంటే ప్రాణమిచ్చే గవర్రాజు గోపాలంను ఏం చేస్తాడు? చివరకు గోపాలం ఎవరిని పెళ్ళి చేసుకుంటాడనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే గురూ..
విశ్లేషణ:
వంశీ సినిమాల్లో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వంశీ-ఇళయరాజా, వంశీ-చక్రి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ సినిమాకు కూడా వంశీ మణిశర్మతో జత కట్టాడు. మణిశర్మ వంశీ స్టయిల్లో ఆడియెన్స్‌ను ఆట్టుకునేలా సంగీతాన్ని అందించాడు. సరసాల సత్యమా...., మేఘాలే తేలే నాలోనా.. పాట, అన్వేషణ.. సాంగ్, పాపికొండల్లో...పాటలన్నీ వినడానికి చాలా బావున్నాయి. అన్ని పాటలను వంశీ గోదావరి పరిసర ప్రాంతాల్లో చక్కగా కలర్‌ఫుల్‌గా చిత్రీకరించాడు. అలాగే మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. నగేష్ బనెలా తన సినిమాటోగ్రఫీతో గోదావరి అందాలను చక్కగా తెరకెక్కించాడు. బస్వా పైడిరెడ్డి సినిమాను మరో ఐదు పదినిమిషాలు తగ్గించే ఉంటే బావుండేది.
లేడీస్ టైలర్ సీక్వెల్ ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్‌ను రూపొందించారు. వంశీ తన మార్కును మరోసారి సక్సెస్‌ఫుల్‌గా తెరపై ఆవిష్కరించాడు. గోదావరి వ్యంగ్యం, కామెడి అన్ని కలగలిపాడు. సుందరం క్యారెక్టర్‌కు ఇంచు మించు దగ్గరగా గోపాలం క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకున్నాడు. లేడీస్ టైలర్‌లో సుందరం మచ్చను నమ్ముకుంటే, ఈ సినిమాలో గోపాలం మన్మథరేఖ అనే మధుర శ్రీధర్ ఇచ్చిన మూలకథకు వంశీ తన మార్కు ఎలిమెంట్స్ జోడించారు.
సుమంత్ అశ్విన్ గోదావరి యాసను వీలైనంత మేర చక్కగా పలకడానికి ట్రై చేసినా డబ్బింగ్ చెప్పే సందర్భంలో ఒకట్రెండు చోట్ల లిప్ సింక్ కుదరలేదు. నటన పరంగా వంశీని సుమంత్ ఫాలో అయిపోయాడని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ముగ్గురు హీరోయిన్స్‌ను గ్లామర్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. అనీషా అంబ్రోస్‌కు చీరకట్టే సీన్, మనాలి రాథోడ్‌ను పాటల్లో గ్లామర్‌గా చూపించిన విధానం బావున్నాయి. అలాగే పాత వంశీ సినిమాల్లో క్యారెక్టర్స్ బిహేవ్ చేసే తీరు,ఈ సినిమాలో కూడా కనపడుతుంది. బట్టల సత్తి కొడుకు పాత్రలో రాఘవేంద్ర తన పాత్రకు న్యాయం చేశాడు. గవర్రాజు పాత్రలో నటించిన వంశీరాజ్ అసలు మనుషుల ప్రాణాలను టీ తాగినంత ఈజీగా చంపేస్తుంటే పోలీసులు పట్టించుకోరెందుకు. అలాగే పశువుల డాక్టర్ శ్యామ్‌గా నటించిన కృష్ణుడు పాత్ర ప్రీ క్లైమాక్స్‌లో నే ముగిసినట్లే కానీ దర్శకుడు క్లైమాక్స్ తర్వాత కూడా ఆ పాత్రను పొగించాడు. అంత అవసరం లేదు. అలాగే హీరో సుమంత్ మానసను రెండు మూడుసార్లు తంతుంటాడు. ఇది ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా ఉంటుంది. కృష్ణ భగవాన్ క్యారెక్టర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. కృష్ణ భగవాన్ కామెడి రెండు, మూడు చోట్ల బాగుంది. అయితే కృష్ణ భగవాన్ పాత్ర ప్రాముఖ్యత పరంగా పరిమితమైందే.
వంశీ గోదావరి అందాలను తెరకెక్కించడంలో తనెంటో ఈ చిత్రంతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. గోదావరి పల్లెటూరి అందాలను ఎంటర్‌టైనింగ్‌తో తెరకెక్కించాడు. వంశీ మార్కు కామెడి సినిమాలను, టేకింగ్‌ను ఇష్టపడేవారికి ఆయన పాత సినిమాలు గుర్తుకు వస్తాయనడంలో సందేహం లేదు.
బోటమ్ లైన్: ఫ్యాషన్ డిజైనర్.... వంశీ మార్కు విలేజ్ ఎంటర్‌టైనర్
Fashion Designer English Version Review
- Read in English