నరసింహన్‌కు ఘన వీడ్కోలు.. కేసీఆర్‌పై ప్రశంసల వర్షం!
- IndiaGlitz, [Saturday,September 07 2019]
నేటితో తెలంగాణ గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుదీర్ఘ నరసింహన్‌కు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో నరసింహన్ వీడ్కోలు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వీడ్కోలు పలకాల్సి రావడం ఎంతో బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్నప్పుడు నరసింహన్ వచ్చారని, ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారేమోనని భయపడ్డానని ఈ సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు. కానీ, వచ్చీరావడంతోనే తెలంగాణ గురించి, ఉద్యమం గురించి ఎంతో ఆసక్తితో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని.. ఉద్యమం గురించి కేంద్రానికి సానుకూల నివేదికలే పంపుతారని అర్థమైందని కేసీఆర్ ఒకింత భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
సోదరుడిలా చూసుకున్నారు!
‘నరసింహన్.. నన్ను ఒక సీఎంలా కాకుండా సోదరుడిలా భావించారు. ఇప్పుడాయన వెళ్లిపోతుంటే చాలా బాధ కలుగుతోంది. కానీ, ఆయన వెళ్లిపోక తప్పదని, భవిష్యత్తులో ఆయనకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను’ అని కేసీఆర్ తెలిపారు.
గవర్నర్ మాట్లాడుతూ..!
‘పెద్దలను గౌరవించడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, కష్టాల్లో ఉన్నప్పుడు నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అనేవి కేసీఆర్‌లో కనిపించాయి. అంతేకాకుండా ఎప్పుడైనా నేను కేసీఆర్‌కి ఫోన్ చేసి నమస్కారం చెబితే మీలాంటి పెద్దవాళ్ళు నా లాంటి చిన్న వాళ్లకు నమస్కారం పెట్టకూడదు అని సీఎం చెప్పేవారు. ఇకపోతే గవర్నర్‌గా తెలంగాణాకి వచ్చిన కొత్తలో తమకు అన్ని విధాలుగా సహకరిస్తామని, ఎలాంటి సమస్యలు రాకుంటే చూసుకుంటామని, ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ నాకు మాటిచ్చారు. మా అమ్మ చనిపోయినప్పుడు సీఎం కేవలం 15 నిమిషాలలో నా దగ్గరికొచ్చి.. అన్ని నేను చూసుకుంటాను.. మీరేం బయపడకండి అని నాకు ధైర్యాన్ని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తన మాటని, తనమీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలన్నింటిలో నిజాయితితో కూడిన మానవత్వం కనిపించింది. నేను పూర్తిచేసిన ప్రాజెక్టుల్లో ఆయన విజన్ కనిపించింది. ప్రజల యొక్క నాడి కేసీఆర్‌కి బాగా తెలుసు. వారందరి కష్టాలు కూడా కేసీఆర్‌కు బాగా తెలుసు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి దొరకడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టం’ అని నరసింహన్ వాఖ్యానించారు.
ఘనంగా వీడ్కోలు..!
కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా, ఆ తర్వాత తెలంగాణ గవర్నర్‌గా ఇలా మొత్తం 9 ఏళ్ల 9 నెలల పాటు నరసింహన్ కొనసాగారు. అయితే శనివారంతో ఆయన ప్రస్థానం ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి భవన్ లో ఆయనను ఘనంగా సన్మానించింది. అనంతరం హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తన సొంత నగరమైన చెన్నైకు నరసింహన్ బయల్దేరారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు నరసింహన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, తెలంగాణ గవర్నర్‌గా రేపు తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.