విజయ్..‘కొండంత’ సాయానికి లేటయ్యిందేం!?

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఎక్కడ విపత్తులు వచ్చినా ముందుగా స్పందించి తన వంతుగా విరాళం ప్రకటించి టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రియల్ హీరో అనిపించుకుంటూ ఉంటాడు. అయితే.. ప్రస్తుతం కరోనా మహ్మమ్మారి ప్రపంచాన్ని కాటేస్తుండటంతో.. దానిపై యుద్ధం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, క్రీడా, రాజకీయ ప్రముఖులు, నటీనటులు, దర్శకనిర్మాతలు తమవంతుగా విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకుంటున్నారు. మరోవైపు టాలీవుడ్‌లో షూటింగ్స్ ఆగిపోవడం.. సినిమా రిలీజ్‌లు కూడా లేకపోవడంతో సినిమానే నమ్ముకున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో వారికోసం చారిటీ కూడా స్థాపించి.. విరాళాలు సేకరించి సాయం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ చాలా వరకు ప్రముఖులు స్పందించి తోచినంత విరాళాలు ప్రకటించారు.

అయితే.. అందరూ ప్రకటించినప్పటికీ ఇంతవరకూ విజయ్ దేవరకొండ మాత్రం ఆ ఊసే ఎత్తలేదు. అంతేకాదండోయ్ పైగా తెలంగాణ ప్రభుత్వం తరఫున కరోనాను ఎలా నివారించొచ్చు..? జాగ్రత్తలు ఏమేం తీసుకోవాలి..? విషయాలను ప్రకటన రూపంలో చెప్పిన ఆయన టాలీవుడ్‌లో ఈ రేంజ్‌లో విరాళాలు వెల్లువలా ఇస్తుంటే ఆయన మాత్రం ఎందుకో ఈసారి పెద్దగా స్పందించలేదు. ఒకవేళ విరాళం ఇచ్చి పబ్లిసిటీ ఎందుకులే అనుకుని మిన్నకుండిపోయారా..? అని అనుకుంటే కచ్చితంగా అటు చారిటీకి ఇచ్చినా.. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇచ్చినా కచ్చితంగా ఫలానా వ్యక్తి ఇంత ఇచ్చారనే టాక్ వచ్చేది.. పైగా ప్రకటన కనీసం చిన్నపాటి వార్త అయినా వచ్చేది. కానీ అవన్నీ ఏమీ లేవ్.

దీంతో.. విజయ్‌పై ఒకింత విమర్శలు, సెటైర్లు వస్తున్నప్పటికీ.. ఆయన అభిమానులు మాత్రం కచ్చితంగా ‘కొండంత’ సాయం చేసి ఆయన పెద్ద మనసే చాటుకుంటారని చెప్పుకుంటున్నారు. మరికొందరైతే ఎంత లాక్‌డౌన్ చేసినప్పటికీ విరాళం ప్రకటించడానికేముంది.. ఆలస్యమైనా రియాక్ట్ అయ్యి స్పందించు విజయ్ అని సలహాలు కూడా ఇస్తున్నారు. మరి విజయ్ మనసులో ఏముందో..? ఎప్పుడు ప్రకటిస్తాడో వేచి చూడాల్సిందే.