‘వకీల్ సాబ్’ ట్రైలర్ విడుదల సమయంలో ఫ్యాన్స్ బీభత్సం..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కంప్లీట్ చేసుకుంటోంది. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ నిన్న అన్ని జిల్లాల్లోని సినిమా థియేటర్లలో అభిమానులు విడుదల చేశారు.
అయితే ఈ ట్రైలర్ విడుదలకు ముందు అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. అసలే పవన్‌కు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందంటేనే ముందు రోజు నుంచి అభిమానులు రచ్చ చేస్తుంటారు. అలాంటిది వారి చేతుల మీదుగానే ట్రైలర్ రిలీజ్ అంటే ఆగుతారా? బీభత్సం సృష్టించేశారు. విశాఖపట్టణంలోని ఓ థియేటర్లో రిలీజ్ చేయగా.. అభిమానులు హంగామా చేశారు. తమ అభిమాన హీరో ట్రైలర్‌ను చూసేందుకు అద్దాలు పగులగొట్టుకుని మరీ లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో ఆ అద్దాలపై ఒకరిద్దరు పడిపోగా.. వారి మీద నుంచే కొందరు పరిగెత్తుకెళ్లడం గమనార్హం. ఈ ఘటనలో కొందరు గాయపడినట్టు సమాచారం.
‘మీరు వర్జినా అని అమ్మాయిలను అడగొచ్చు.. మేం అబ్బాయిలను అడగొద్దా? ఏం న్యాయం నందాజీ’ అంటూ ట్రైలర్లో ప్రకాశ్‌రాజ్‌కు పవన్ కౌంటర్ ఇచ్చే తీరు ఆకట్టుకుంది. మరోసారి నందా, బద్రీల కాంబో తెరపై ఆవిష్కృతం కానుంది. పవన్‌కు, ప్రకాష్‌రాజ్‌కు మధ్య జరిగే కోర్టు సన్నివేశాలు అదిరిపోయాయి. పవన్ రీ ఎంట్రీకి ఈ సినిమా సరిగ్గా సరిపోతుందనడంలో సందేహం లేదు. పవన్ చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అన్యాయంగా కేసులో బుక్కయిన ఒక అమ్మాయి.. ఎలాగైనా కేసు నుంచి బయట పడాలని ఆ అమ్మాయితో పాటు తనకు సంబంధించిన మరో ఇద్దరు అమ్మాయిలు ప్రయత్నించి విసిగి వేసారిపోయిన టైమ్‌లో పవన్ ఎంట్రీ ఇవ్వడం అద్భుతం. పవన్ ఆ ముగ్గురు అమ్మాయిలకు ఎలా అండగా నిలిచారు? ఎలా బయటకు తీసుకొచ్చారు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లతో ఈ చిత్రం రూపొందిందని ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout