మహా’ ట్విస్ట్.. సీఎం ఫడ్నవిస్, అజిత్ రాజీనామా
Send us your feedback to audioarticles@vaarta.com
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేయగా.. తాజాగా సీఎం ఫడ్నవిస్ తన పదవికి రాజీనామా చేశారు. మొత్తానికి చూస్తే గత కొన్ని రోజులుగా ‘మహా’నాట నెలకొన్న బీజేపీ ఎపిసోడ్‌కు ఫుల్స్టాప్ పడినట్లయ్యింది. ప్రమాణ స్వీకారం చేసిన మూడంటే మూడే రోజులకు ఫడ్నవిస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. బలనిరూపణకు ఒక రోజు ముందే ఫడ్నవీస్ రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రెస్మీట్లో తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
నిప్పులు చెరిగిన ఫడ్నవిస్..
‘ప్రజలు మహాయుతికే పట్టం కట్టారు. అందుకే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాం. శివసేన చెబుతున్నట్టుగా గతంలో ఎలాంటి హామీలు ఇవ్వలేదు. మేం శివసేన మద్దతు కోసం ఎదురుచూశాం కానీ వాళ్లు కనీసం చర్చలు కూడా జరపలేదు. బీజేపీని శివసేన బెదిరించింది. పొత్తు కుదిరాక శివసేన మోసం చేసింది. అబద్ధాలాడుతూ ఇతర పార్టీలతో చర్చలు సాగించింది. అసెంబ్లీలో మాకు సంఖ్యాబలం లేదు. బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. రాష్ట్రపతి పాలన వద్దని.. అజిత్ పవార్ మాతో చేతులు కలిపారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు లేఖలతోనే ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఆ తర్వాత మాతో కొనసాగలేనంటూ అజిత్ రాజీనామా చేశారు. అజిత్ పవార్‌తో పాటు ఎన్సీపీ ఎమ్మెల్యేలు వస్తారని భావించాం. పార్టీలను చీల్చే ఉద్దేశం మాకు లేదు. బీజేపీని శివసేన మోసం చేసింది. అబద్ధాలాడుతూ ఇతర పార్టీలతో చర్చలు సాగించింది’ అని శివసేన, ఎన్సీపీలపై ఫడ్నవీస్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మొత్తానికి చూస్తే అదేదో సామెత ఉంది కదా.. మూడ్నాళ్ల ముచ్చట... అని అది బీజేపీ రాజకీయాలకు అక్షరాలా సరిపోయిందని విమర్శకులు.. నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments