విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఓ క్రేజ్ ఉంటుంది. అందుకు కారణం ఆయన నటించిన ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకునచ్చావ్, మల్లీశ్వరి.. ఇలా ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరో. ఈ మధ్య కాలంలో`దృశ్యం`, `గురు` వంటి డిఫరెంట్ సినిమాలు చేసిన వెంకీ .. మళ్లీ తన కామెడీ స్టైల్లో చేసిన సినిమా `ఎఫ్ 2`...ఇక వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆ క్రమంలో వరుణ్ తొలిసారి నటించిన పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ `ఎఫ్ 2`. ఇప్పటి వరకు చేసిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలు కమర్షియల్ చిత్రాలే అయినా..తనదైన స్టైల్లో కామెడీనీ జోడించిన దర్శకుడు ఈసారి ఎఫ్ 2 అంటూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చాలా కాలంగా మంచి హిట్ సినిమా తీయాలని వెయిట్ చేస్తున్న దిల్‌రాజుకు ఎఫ్ 2 ఎలాంటి విజయాన్ని తెచ్చిపెట్టిందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
ఎమ్మెల్యే(రఘుబాబు) పర్సనల్ అసిస్టెంట్ వెంకీ(వెంకటేష్) మాటల చాకచక్యంతో బ్రతికేస్తుంటాడు. హారిక(తమన్నా)తో వెంకీ పెళ్లవుతుంది. మొదటి ఆరు నెలలు బాగానే ఉంటుంది. భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటుంది. దాన్ని వెంకీ సర్దిచెప్పలేక, ఫ్రస్టేషన్‌కు గురవుతాడు. హారకకి హనీ(మెహరీన్) కూడా తోడవుతుంది. ఓసారి హనీని ఆమె బాయ్ ఫ్రెండ్ వరుణ్(వరుణ్‌తేజ్)తో చూస్తాడు వెంకీ.. ఆ విషయాన్ని ఇంట్లో చెబితే వాళ్లు నమ్మరు. సరికదా నిరూపించమని చాలెంజ్ చేస్తారు. దాంతో వెంకీ ఓ సందర్భంలో వరుణ్, హనీలను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంటాడు. దాంతో వెంకీ అత్తమామలు వెంకీ ఎక్కడ తమను ఫ్రస్టేషన్‌లో ఇబ్బంది పెడతాడోనని భయపడి.. వరుణ్, హనీల విషయం తమకు తెలుసునని బుకాయిస్తారు. వారిద్దరికీ నిశ్చితార్థం చేస్తారు. పెళ్లి చేయాలనుకుంటారు. అయితే ఈ పెళ్లి జరిగే గ్యాప్‌లో హనీ ప్రవర్తనను డామినేషన్‌గా ఫీలైన వరుణ్ పెళ్లంటే భయపడతాడు. వీరిద్దరికీ వెంకీ పక్కింటాయన(రాజేంద్ర ప్రసాద్) కూడా తోడవుతాడు. ముగ్గురు కలిసి యూరప్ పారిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. వరుణ్ ఫ్రెండ్(ప్రియదర్శి) ద్వారా అసలు విషయం తెలుసుకున్న హారిక, హనీలు యూరప్ వస్తారు. కానీ వెంకీ, వరుణ్‌లు వారి మాటలను ఖాతరు చేయరు. దాంతో హారిక, హనీలు ఏం చేస్తారు? వారు తీసుకునే నిర్ణయం ఎలాంటిది? అసలు దొరైస్వామి నాయుడు ఎవరు? చివరకు వెంకీ-హారిక, వరుణ్-హనీ ఎలా కలుసుకున్నారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
- నటీనటులు
- అనిల్ రావిపూడి రైటింగ్.. టేకింగ్
- సినిమా ఆసాంతం ఆకట్టుకునే కామెడీ
-కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్:
- ఫస్టాఫ్ మీద సెకండాఫ్ కాస్త వీక్‌గా అనిపిస్తుంది
- దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
- కథ
సమీక్ష:
సినిమాకు ప్రధాన బలం తారాగణం.. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది వెంకటేష్.. వెంకీ నటన చూస్తే నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల్లో వెంకటేష్ గుర్తుకు వస్తారు. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో రఘుబాబుతో, వరుణ్, మెహరీన్‌లను పట్టుకునే సన్నివేశాల్లో, కుక్కతో చేసే కామెడీ రాజేంద్ర ప్రసాద్‌ను ఆయన భార్యల దగ్గర ఇరికించే సన్నివేశాలతో పాటు భార్య వల్ల వచ్చే ఫ్రస్టేషన్‌ను.. వెంకీఆసనంతో తగ్గించుకోవడం ఇలా ప్రతి సీన్‌లో నవ్వించారు. ఇక తెలంగాణ యాసలో మాట్లాడుతూ వరుణ్ తేజ్ కాబోయే భార్యను, తల్లిని సముదాయించలేక బాధపడటం.. దాని వల్ల కామెడీ సన్నివేశాలు అన్నీ బావున్నాయి. కామెడీ పరంగా వరుణ్ పాత్రకు తగ్గట్టు నటించాడు. ఇక తమన్నా అట్యిట్యూడ్ ఉన్న అమ్మాయిగా.. భర్తను ఇబ్బంది పెట్టే ఇల్లాలుగానే కాదు.. భర్తంటే ప్రేమ ఉండే భార్యగా కూడా చక్కగా నటించింది. మెహరీన్ పాటలు పాడే సన్నివేశాలు, డాన్స్ వేసే సన్నివేశాల్లో వచ్చే కామెడీతోపాటు.. చమ్మక్ చంద్ర బెల్ట్‌తో కొట్టుకునే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. ఇక తమన్నా, మెహరీన్‌లు ఇద్దరూ కలిసి సెకండాఫ్‌లో వెంకటేష్, వరుణ్‌తేజ్‌లను ఆట్టపట్టించే సన్నివేశాలు.. బావున్నాయి. ఇక భార్యను ప్రేమించే పక్కింటాయనలా నటించిన రాజేంద్ర ప్రసాద్‌కు మరో భార్య ఉన్నట్లు తెలిసే సన్నివేశం .. దాని నుండి కామెడీ నవ్విస్తుంది. సెకండాఫ్‌లో హరితేజ దగ్గర చిక్కుకుని ఇబ్బందులు పడటం, భయపడటం అన్నీ నవ్విస్తాయి. యూరప్‌లో ఉండే ఎన్నారై పాత్రలో ప్రకాష్‌రాజ్, ఆయన అన్నయ్య..హార్ట్ పెషెంట్‌గా పృథ్వి, .. ఇతర పాత్రల నుండి వచ్చే కామెడి ద్వితీయార్థం నవ్విస్తుంది. వై.విజయ, అన్నపూర్ణమ్మ పాత్రలు నా కాళ్ల కడియాలు నీకే.. చెవిదిద్దులు నాకే... అనే సన్నివేశంలో కామెడి బావుంటుంది. భర్తలకు బుద్ధి చెప్పాలనుకున్న భార్యలుగా సెకండాఫ్‌లో తమన్నా, మెహరీన్ నటించారు. అనసూయ అతిథి పాత్ర బావుంటుంది. శ్రీనివాస్‌రెడ్డి కామెడీ మెప్పిస్తుంది. చివర్లో కామెడి విలనిజంతో వెన్నెలకిషోర్ నవ్వించాడు. అనీల్ రావిపూడి తన రైటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తను కామెడి చేయించడంలో ఎంత చేయి తిరిగి ఉన్నాడో సినిమా చూస్తే అర్థమవుతుంది. రొటీన్ కథనే ఆసక్తికరంగా చెప్పగలడో ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతి సన్నివేశాన్ని కామెడి టింజ్ కలిపి తెరకెక్కించాడు. చివర వచ్చే సీన్లో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. దేవిశ్రీ సంగీతం బాలేదు. అయితే సిచ్యువేషనల్ సాంగ్స్ కాబట్టి పాటలు నడిచిపోతాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బాలేదు. సమీర్ రెడ్డి కెమెరా పనితనం బావుంది. ఫస్టాఫ్‌లో వచ్చే బుర్ర గిర గిరా ... అనే సాంగ్ మాస్ ఆడియెన్స్‌కు నచ్చుతుంది. అలాగే సినిమాలో తమన్నా, మెహరీన్‌లు గ్లామర్ డోస్‌ను ఎక్కువగా చూపించారు. సినిమా ప్రథమార్థంతో పోల్చితే సెకండాఫ్ కాస్త వీక్‌గా ఉంటుంది. దేవి మ్యూజిక్ పెద్ద ఎఫెక్టివ్‌గా లేదు. మొత్తంగా చూస్తే సినిమా ఫన్ రైడర్‌లా ఉంటుంది.
బోటమ్ లైన్: ఎఫ్ 2.. సంక్రాంతి అల్లుళ్లు విజేతలు
Comments