Jana Sena:కాపులకు తీవ్ర అన్యాయం.. కేవలం 24 సీట్లేనా..?.. రగిలిపోతున్న జనసైనికులు..
Send us your feedback to audioarticles@vaarta.com
118 మందితో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే మొత్తం 175 నియోజకవర్గాల్లో జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించినట్లు చంద్రబాబు స్పష్టంచేశారు. అలాగే 25 ఎంపీ స్థానాల్లోనూ మూడంటే మూడే స్థానాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇక బీజేపీతో పొత్తు కోసం మిగిలిన స్థానాలను హోల్డ్‌లో పెట్టారు. ఈ ప్రకటన చూశాక జనసైనికులు తీవ్రంగా మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా కేవలం 24 స్థానాలే ఇచ్చి తమను ఆకులో కరివేపాకులా మమ్మల్ని తీసిపాడేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు.
బయటపడిన చంద్రబాబు నిజస్వరూపం..
చంద్రబాబు మళ్లీ తన సహజ నైజాన్ని బయటపెట్టుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చెప్పేదొకటి.. చేసేదొకటి... బయటకు ఎన్ని చెప్పినా.. ఎన్ని నీతులు మాట్లాడినా చివరగా తనకు, తన పార్టీకి లబ్దిచేకూరేలా మాత్రమే పనిచేస్తారని మరోసారి నిరూపించారని ధ్వజమెత్తుతున్నారు. ఆరు నెలలుగా తమతో పొత్తులో ఉంటూ కాపుల బలాన్ని వాడుకునేందుకు ప్లాన్ వేసిన చంద్రబాబు.. ఇప్పుడు తన నిజస్వరూపాన్ని బయటకు తీశారని దుయ్యబడుతున్నారు. చంద్రబాబు మాత్రం 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే.. పవన్ కల్యాణ్ మాత్రం జనసేనకు కేటాయించిన 24 సీట్లలోనూ కేవలం ఐదుగురినే ప్రకటించడం ఏంటని నిలదీస్తున్నారు.
తన సీటు కూడా ప్రకటించుకోలేని స్థితిలో..
మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అనేది కూడా తేల్చలేదు. అంటే ఆ స్థానాల్లో కూడా చంద్రబాబు సూచించిన వారినే జనసేన తరఫున పోటీ చేయిస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇదే కాకుండా టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్, బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. కానీ జనసేన తరఫున ప్రకటించిన ఐదుగురు పేర్లలో పవన్ కల్యాణ్ పేరు కూడా లేదు. అయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది కూడా చెప్పలేదు. అంటే చివరకు తమ అధినేత ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని వాపోతున్నారు. తన సీటు తాను ప్రకటించుకోలేని స్థితిలో పొత్తుకు సిద్ధమై చంద్రబాబుకు తలొగ్గారని ఆవేదన చెందుతున్నారు
కాపులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం..
ఇదిలా ఉంటే ప్రస్తుతం 118 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిగిలిన 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో బీజేపీని పొత్తులోకి తీసుకుని ఆ పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వనున్నారు. ఒకవేళ బీజేపీ పొత్తులో కలిస్తే వారికి కొన్ని సీట్లు ఇవ్వగా.. మిగిలిన సీట్లలోనూ తెలుగుదేశం అభ్యర్థులే పోటీ చేయనున్నారు. అంటే ఇక జనసేన పార్టీని మొత్తానికి 24 సీట్లకే పరిమితం చేసి చంద్రబాబు మరోసారి తమను తీవ్రంగా మోసం చేశారని జనసైనికులు రగిలిపోతున్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు కాపులకు మరోసారి చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని మండిపడుతున్నారు.
ముస్లిం మైనార్టీలకు ఒక్క సీటు మాత్రమే..
మరోవైపు తమకు కూడా చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని ముస్లిం మైనార్టీలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. రెండు పార్టీలు ప్రకటించిన 118 సీట్లలో కేవలం ఒక్క సీటు(నంద్యాల నుంచి ఎండీ ఫారూఖ్) మాత్రమే తమకు కేటాయిస్తారా అని నిలదీస్తున్నారు. ముస్లిం మైనారిటీల పట్ల రెండు పార్టీలకున్న చిత్తశుద్ధి ఏంటో ఇక్కడే అర్థమవుతోందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించి కూటమికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి టీడీపీ-జనసేన ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితా రెండు పార్టీల్లో తీవ్ర అసంతృప్త జ్వాలలు రగిలిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout