‘గరీబ్ కల్యాణ్ యోజన’ను దీపావళి వరకూ పొడిగిస్తున్నాం: మోదీ
- IndiaGlitz, [Tuesday,June 30 2020]
కరోనా విషయంలో మరింత అప్రమత్తత వహించాల్సిన సమయంలో మరింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. నేడు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా ప్రారంభంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుని లాక్‌డౌన్ పెట్టడంతో చాలా మంది ప్రాణాలు కాపాడినట్టు వెల్లడించారు. మాస్క్, భౌతికదూరం తప్పనిసరి అని పేర్కొన్నారు. గ్రామీణులకైనా, దేశ ప్రధానికైనా ఒకే నిబంధనలుండాలని మోదీ తెలిపారు.
కరోనాతో పోరులో భాగంగా అన్‌లాక్ 2.0లోకి ప్రవేశించామన్నారు. ఈ సమయంలో జలుబు, జ్వరం వంటి రోగాలు చుట్టుముట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనంగా గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని దీపావళి వరకూ కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పథకం కింద ఐదు నెలల పాటు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు, కిలో చక్కెర అందిస్తామని మోదీ వెల్లడించారు. ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని పేర్కొన్నారు.