kothapalli geetha: రూ.కోట్ల రుణం ఎగవేత.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు

  • IndiaGlitz, [Wednesday,September 14 2022]

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ వద్ద నుంచి రూ.50 కోట్ల మేర రుణం తీసుకుని ఎగవేసిన కేసులో ఆమెను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్ ఫిర్యాదు మేరకు గీతను అరెస్ట్ చేశారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపై గీతను సీబీఐ కోర్టులో హాజరు పరిచారు అధికారులు.

గీత దంపతులిద్దరికీ ఐదేళ్ల జైలు:

ఈ సందర్భంగా కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావులకు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష, రూ లక్ష జరిమానా విధించింది. వీరితో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు జయప్రకాశన్, కేకే అరవిందాక్షన్‌లకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష, విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది. అనంతరం కొత్తపల్లి గీతను చంచల్‌గూడ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు.

కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా కొత్తపల్లి గీత:

కొత్తపల్లి గీత 2014లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు. కానీ ఆ పార్టీకి దూరంగా వుంటూ వచ్చారు. 2018లో జనజాగృతి పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. తర్వాత కొన్నాళ్లకే బీజేపీలో చేరి, తన పార్టీని అందులో విలీనం చేశారు గీత. 2015లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. గీతతో పాటు ఆమె భర్త కోటేశ్వరరావు, హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ ఎండీపై కేసు నమోదు చేసింది. వీరి కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.42.79 కోట్లు నష్టం వాటిల్లినట్లు సీబీఐ తన ఛార్జీషీట్‌లో పేర్కొంది.