జనసేనలోకి మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఎంపీ.. ముహుర్తం ఖరారు..
- IndiaGlitz, [Wednesday,January 24 2024]
ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ.. ఈసారి జగన్‌ను గద్దె దించాలని టీడీపీ-జనసేన కంకణం కట్టుకున్నాయి. దీంతో ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. మరోవైపు అన్ని పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. అయితే ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి టీడీపీ-జనసేన పార్టీల్లోకి జంపింగ్‌లు ఎక్కువగా ఉండటం విశేషం.
వారం రోజుల్లోనే చేరికలు..
సీఎం జగన్(CM Jagan) అభ్యర్థులను మార్చడంతో తీవ్ర అసంతృప్తికి గురైన కొంతమంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది టీడీపీ, జనసేన కండువాలు కప్పుకునేందుకు రెడీ అయ్యారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎంపీలు జనసేనలో చేరేందుకు మొగ్గు చూపడం గమనార్హం. ఇప్పటికే ఆ పార్టీలోకి చేరేందుకు అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. దీంతో త్వరలోనే వారు పార్టీలో చేరనున్నారు. మరో వారం రోజుల్లోనే ఈ చేరికలు ఉండనున్నాయి.
పార్టీలోకి కొణతాల, ముద్రగడ, వల్లభనేని..
ముందుగా ఈనెల 27న మాజీ మంత్రి, మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ(Konathala Ramakrishna ) పార్టీ కండువా కప్పుకోనున్నారు. అనంతరం ఈనెల 30న మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) పవన్ సమక్షంలో చేరనున్నారు. అలాగే వచ్చే నెల 2న మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి(Balashowry)జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. వీరితో పాటు అతి త్వరలోనే క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) కూడా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు కాపు సామాజిక వర్గంలో పెద్దాయనగా పేరు ఉంది. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన పోరాడిన తీరుకు ఎందరో అభిమానులు అయిపోయారు. అలాగే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. ఇక మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు కూడా సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగానూ పని చేశారు. బాలశౌరి కూడా రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. మొత్తానికి ఇలా రాజకీయంగా అనుభవం ఉన్న నేతలందరూ జనసేనలో చేరనుండటంతో ఆ పార్టీ క్యాడర్‌లో ఎన్నడూ లేని ఉత్సాహం కనపడుతోంది. వీరితో పాటు మరికొంత మంది కీలక నేతలు కూడా జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈసారి అసెంబ్లీతో పాటు ప్రభుత్వంలో బలమైన భాగ్యస్వామి పార్టీగా నిలబడే దిశగా పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.