వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు..
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీకి రాజీనామా చేసే నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను సీఎం జగన్ పంపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. దళితుల బాధలను, కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలంటే కనీసం ఆయన అపాయింట్మెంట్ దొరకడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నెల రోజుల్లో సుమారు వెయ్యి సార్లు జగన్‌కు ఫోన్ చేశానని.. కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు.
ఓ దళిత మాజీ ఎమ్మెల్యే అయిన తనకు పార్టీలో అవమానం జరిగిందని..అందుకే మనస్తాపానికి గురై రాజీనామా చేశానని ప్రకటించారు. పార్టీలో చేరిన నాటి నుంచే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. పార్టీ పరంగా దక్కాల్సిన అవకాశాలను పెద్దిరెడ్డి దూరం చేస్తూ వచ్చారని మండిపడ్డారు. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులు, బీసీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం ఆధిపత్యం నడుస్తోందని.. బానిసలుగా ఉన్నవారికే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వస్తున్నాయని ఫైర్ అయ్యారు.
ఈ జిల్లాలో వైసీపీకి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గొప్ప సర్వీస్ చేశారని.. అలాంటి దళిత నాయకుడికి కూడా టికెట్ ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే బాబుకి కూడా సీటు లేకుండా చేశారన్నారు. కేవలం దళిత ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. ఇక నుంచి వైసీపీ చేస్తున్న అవినీతి, అక్రమాల మీద పోరాటం చేస్తానని తేల్చిచెప్పారు. త్వరలో గంగాధర నెల్లూరులో జరగున్న 'రా..కదిలిరా' సభలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరతానని స్పష్టంచేశారు.
కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో అభ్యర్థుల మార్పు వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే పార్టీ అధిష్టానంపై పూతలపట్టు ఎమ్మెల్యే బాబు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ధిక్కార స్వరం వినిపించారు. వీరిలో ఆదిమూలం పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. ముఖ్యంగా దళిత నియోకజకవర్గాల్లోనే మార్పులు చేయడం వివాదాస్పదమవుతోంది. చిత్తూరు ఎంపీ రెడ్డప్పను జీడీ నెల్లూరుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా.. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా మార్చారు. మళ్లీ తాజాగా వారి సిట్టింగ్ స్థానాలకు వారినే కేటాయించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments