Somireddy:మాజీ మంత్రి సోమిరెడ్డి దీక్ష భగ్నం.. భారీగా తరలివచ్చిన హిజ్రాలు..

  • IndiaGlitz, [Tuesday,December 19 2023]

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ ఆపేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) చేపట్టిన నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి అక్రమంగా క్వార్ట్జ్‌ తవ్వుతున్నారంటూ మూడు రోజుల నుంచి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. అయితే సోమవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో దీక్షా శిబిరం వద్దకు భారీగా పోలీసులు వెళ్లి సోమిరెడ్డిని బలవంతంగా ఆయన ఇంటికి తరలించారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అయితే అంతకుమందు సోమిరెడ్డి దీక్ష చేస్తున్న ప్రాంతానికి భారీగా హిజ్రాలు చేరుకుని హల్‌చల్ చేశారు. వారితో పాటు వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని క్వారీలో ఉన్న యంత్రాలు, వాహనాలను బయటకి పంపేయత్నం చేశారు. వారిని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్ణణ తలెత్తింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. కానీ ఓ సీనియర్ నేత శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అంతమంది హిజ్రాలను తరలించి శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూడటంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. అక్రమ మైనింగ్ వెనక మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy)హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.

పొదలకూరు మండలంలో రుస్తుం క్వారీ నుంచి మంత్రి కాకాణి అండదండలతో ఆయన అనుచరులు రూ.కోట్ల తెల్లరాయిని తరలిస్తున్నారని ఆరోపిస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ‘సత్యాగ్రదీక్ష’ పేరుతో ఈ నెల 16 నుంచి ఆందోళనకు దిగారు. మూడు రోజులుగా క్వారీ వద్దే దీక్షకు చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజా సంపదను అక్రమంగా కొల్లగొడుతున్నారని ఆరోపించారు. దీంతో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.