ఒకరిద్దరు హీరోలపై కక్ష.. మొత్తం సినీ పరిశ్రమనే నాశనం చేస్తారా: జగన్‌పై సోమిరెడ్డి ఆగ్రహం
- IndiaGlitz, [Sunday,December 26 2021]
ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ వర్గాలు మాత్రమే దీనిపై స్పందించగా.. ఇప్పుడు ఏపీలోని రాజకీయ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ ధరలు తగ్గింపు, థియేటర్ల మూసివేతపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ స్పందించింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుతో పేదలకు ఏదో ప్రయోజనం చేశామని ప్రభుత్వం చెబుతోందని .. కానీ అదే పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తోందన్న విషయాన్ని గమనించడం లేదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇద్దరు, ముగ్గురు హీరోలపై కక్షతో సినిమా పరిశ్రమను నాశనం చేసే హక్కు ఎవరిచ్చారని చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
ఇప్పటికే ఏపీలో 125 థియేటర్లు మూతపడ్డాయని.. కక్ష సాధింపులకూ హద్దు ఉంటుందని ఆయన హితవు పలికారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అతి పెద్ద థియేటర్‌ను మూసివేశారని.. సినిమా థియేటర్లలో గంజాయి ఏమైనా ఉందా? అని సోమిరెడ్డి నిలదీశారు. రాత్రి వెళ్లి దాడులు చేసి మూసివేసే హక్కు ఎవరిచ్చారని సోమిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో రైతుబంధు కింద రూ.10వేలు ఇస్తున్నారని.. పథకాలతో పోటీ పడాలని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వానికి చేతనైతే నిత్యావసర వస్తువులు, ఇసుక ధరలు తగ్గించాలని చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాగా... గడిచిన రెండు రోజులుగా ఏపీలో థియేటర్లపై రెవెన్యూ, పోలీసు అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తనిఖీలు చేపట్టిన అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా వున్న థియేటర్లను సీజ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 35తో థియేటర్లు నడపలేమంటూ పలువురు థియేటర్ యజమానులు స్వచ్చంధంగా మూసివేస్తున్నారు.