Perni Nani:నేనూ మెగాస్టార్ అభిమానినే .. కానీ, గిల్లితే గిల్లించుకోవాల్సిందే.. గోకితే గోకించుకోవాల్సిందే : చిరుపై పేర్ని నాని సెటైర్లు

  • IndiaGlitz, [Tuesday,August 08 2023]

ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. చిరంజీవి సినిమాను సినిమాగా.. రాజకీయాలను రాజకీయంగా చూడాలని ఆయన హితవు పలికారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ నుంచి ఏపీ సచివాలయానికి ఎంత దూరమో.. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్‌కు అంతే దూరమని నాని వ్యాఖ్యానించారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు సినీ పరిశ్రమలోని హీరోలపై మాట్లాడిందడా ఆయన ప్రశ్నించారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్, రాంచరణ్ ఇలా ఎవ్వరినీ ఉద్దేశించి కూడా ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదని పేర్ని నాని తెలిపారు. వారి రెమ్యూనరేషన్ గురించి కూడా ఎవ్వరూ అడగలేదని స్పష్టం చేశారు.

దాడికి ప్రతిదాడి తప్పదు :

ఒక మంత్రిని టార్గెట్ చేసి సినిమాలో క్యారెక్టర్లు పెట్టారని.. అలాంటప్పుడు విమర్శలు ఎదుర్కోక తప్పదని పేర్ని నాని పేర్కొన్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లు గిల్లితే గిల్లించుకోవాలని వుండదని.. బయట ప్రపంచంలో గిల్లినప్పుడు గిల్లుతారని ఆయన చురకలంటించారు. ఒక నాయకుడిపై అనవసరంగా వివాదం సృష్టించింది ఎవరు.. దాడి చేస్తే ఎదురుదాడి తప్పదని పేర్ని నాని పేర్కొన్నారు. సినిమాలో మాదిరిగా హీరో విలన్‌ని కొడుతుంటు చూస్తూ కూర్చొన్నట్లుగా రాజకీయాల్లో వుండదని.. ఒకరు గోకితే ఎదుటివారు కూడా గోకుతారని పేర్ని నాని వెల్లడించారు.

కాలేజ్ రోజుల్లో చిరంజీవికి దండలు వేశా :

తన అభిమాన హీరో చిరంజీవి కేంద్ర మంత్రిగా వున్నప్పుడే రాష్ట్ర విభజన జరిగిందని ఆయన గుర్తుచేశారు. అప్పుడు చిరంజీవి ఏ పార్టీలో వున్నారు.. ప్రత్యేక హోదా గురించి చట్టంలో పెట్టకుండా ప్రకటన చేస్తే ఆయన ఎందుకు మాట్లాడలేదని పేర్ని నాని ప్రశ్నింనచారు. తాను వ్యక్తిగతంగా చిరంజీవికి అభిమానినని.. చదువుకునే రోజుల్లో దండలు కూడా వేశానని ఆయన గుర్తుచేశారు.