Mudragada Padmanabham:నేను నీ బానిసను కాను.. కాకినా, పిఠాపురంలో పోటీకి సిద్ధమా : ఈసారి పవన్‌పై రెచ్చిపోయిన ముద్రగడ
- IndiaGlitz, [Friday,June 23 2023]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్‌గా మరో లేఖ సంధించారు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఈసారి కాస్త సీరియస్‌గాను లేఖను వదిలారు పెద్దాయన. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను లేఖను వదిలానని.. కానీ మీరు మాత్రం మీ అభిమానులతో తనను బండ బూతులు తిట్టిస్తున్నారని పద్మనాభం ఆరోపించారు. ఆ మెసెజ్‌లకు తాను లొంగిపోనని.. ఈ జన్మకు అది జరగదని ఆయన స్పష్టం చేశారు. పవన్ సినిమాల్లోనే హీరో కానీ. .రాజకీయాల్లో కాదని ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టాల్సిన అవసరం పవన్‌కు, ఆయన ఫ్యాన్స్‌కి ఏమొచ్చింది, తానేమి పవన్ కల్యాణ్ దగ్గర నౌకరుగా పనిచేయడం లేదని పద్మనాభం సీరియస్ అయ్యారు.
డబ్బులిచ్చి అభిమానులతో తిట్టిస్తున్నారు:
ఇన్నేళ్లలో తాను పవన్ కల్యాణ్ గురించి ఏనాడు పత్రికలలో ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదని, కాకినాడ ఎమ్మెల్యేను తిట్టడం తప్పో, ఒప్పో ఆయనే తెలుసుకోవాలన్నారు. కానీ నన్ను తిట్టినదానికి స్పందించి లేఖ రాయడంతో, పవన్‌కు ఎక్కడా లేని కోపం వచ్చి అభిమానులతో తిట్టిస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. తనకు వ్యక్తిగత అభిప్రాయాలు కూడా వుండకూడదా.. తాను పవన్‌కు తొత్తుగా వుండాలా అని ఆయన ప్రశ్నించారు. పవన్‌కు డబ్బుంది కాబట్టి అభిమానుల చేత తనను తిట్టిస్తారా అంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానొక అనాథను, ఒంటిరివాడిని, ఏమన్నా పడతాననే గర్వమా అంటూ పద్మనాభం ఫైర్ అయ్యారు. తాను లేఖలో కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నానని.. వాటికి సమాధానం చెప్పాలో లేదో పవన్ విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇంతకుమించిన విషయాలు లేఖలో రాస్తే మహాభారతం అవుతుందని ఇంతటితో ఆపేస్తున్నానని పద్మనాభం తెలిపారు.
పవన్‌కు ముద్రగడ పద్మనాభం సంధించిన ప్రశ్నలు :
1988లో వంగవీటి రంగాగారిని హత్య చేసిన తరువాత ఎంతో మందిని అమాయకులను జైలులో పెట్టిన సంఘటన.
ఆ సందర్భములో జైలులో ఉన్న వారిని ఎప్పుడైనా తమరు వెళ్ళి చూసారా?
జైలులో ఉన్న వారి కుటుంభాలకు ధైర్యం చెప్పడం కోసం ఏ రోజైనా పలకరించడానికి వారి గృహాలకు వెళ్ళారా?
జైలులో ఉన్న వారికి బెయిల్స్ తేవడం కోసం ఎప్పుడైనా అడ్వకేట్స్తో మాట్లాడారా?
జైలులో ఉన్న వారి మీద టెర్రరిస్టుల కోసం తయారు చేసిన చట్టంలోని కొన్ని సెక్షన్లు వేసి కేసులు పెట్టిన సంగతి తమరెరుగుదురా?
1988-89లో 3500 మంది అమాయకుల పై పెట్టిన కేసులు తీసివేయమని ఎప్పుడైనా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారిని కలిసి కోరారా?
1993-94 లో రావులపాలెంలో అప్పటి ముఖ్యమంత్రి గారి సభలో కాపులను గొడ్డును బాదినట్లుగా బాదిన బాదితులను ఏరోజైనా పలకరించారా?
1993-94 ఉద్యమ సందర్భముగా అప్పట్లో పెట్టిన కేసులు అప్పటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబునాయుడు గారిని తీసివేయమని అడిగారా?
ఎవరు కోరకుండానే ఆరోజు కాపులపై పెట్టిన కేసులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసేసిన సంగతి మీకు తెలుసా?
2016 తుని సభ మరియు తరువాత పెట్టిన కేసులలో ఉన్న వారిని ఎప్పుడైనా పలకరించారా? అక్రమంగా అన్యాయంగా పెట్టిన కేసులు తీసివేయమని గౌరవ చంద్రబాబునాయుడు గారిని, గౌరవ జగన్మోహనరెడ్డిగారిని ఎప్పుడైనా కోరడం జరిగిందా?
గౌరవ కాపు మంత్రుల కోరికపై గౌరవ జగన్మోహనరెడ్డి గారు 2016 నుండి పెట్టిన కేసులు తీసివేసిన సంగతి తెలుసా?
నేను వ్రాసిన ఈ సంఘటనలలో ఎవరి పాత్ర ఉందో మీకు గాని, మీ వన్మేన్ ఆర్మీకి గాని తెలుసాండి? ఈ కులం కోసం నేనేమీ చేయనట్టు స్వార్ధపరుడను అని కులాన్ని ఉపయోగించుకుంటున్నానని, అమ్మేసానని రకరకాల మాటలు చెప్పడం సినిమా డైలాగులను మరిపించిందండి.
గోచీ, మొలత్రాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదు. దమ్ము, ధైర్యం ఉంటే, మీరు తిట్టండి, గోచీ మొలత్రాడు ఉన్న వారితో సమాధానం చెప్పించగలను. ఒక విషయం పవన్ గారు కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిది. ఏనాడైనా కాపుల గురించి ఆలోచించిన సందర్భం ఉందాండి?
యువతను భావోద్వేగానికి గురి చేస్తున్నది ఎవరో మీ ప్రసంగాలలోనే తెలుస్తోంది.
పోనీ ఈ మద్య డా॥ అంబేద్కర్ కోన సీమ జిల్లా పేరు పెట్టిన సందర్భములో అగ్నిగుండంగా మారిన గొడవలలో ఎంతో మంది అమాయకులపై పెట్టిన కేసులకు బెయిల్ రాని పరిస్థితులలో ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు వారికి అండగా నేను ఉన్నానని నిత్యం మిమ్మల్నే తరించే
వారికోసం కోనసీమకు తమరు ఎందుకు వెళ్ళలేదు?
వీరికి బెయిల్ కోసం అడ్వకేట్స్తో మాట్లాడి బెయిల్ వచ్చే ఏర్పాటు ఎందుకు చేయలేదు?
కేవలం తమరి కోసం అందరూ రోడ్డు మీదకు రావాలి? రోడ్డు మీదకు వచ్చిన వారు ఆపదలో ఉన్నప్పుడు వారికి మీరు చేతనైన సహాయం చేయరా?
మీరు నన్ను తిట్టిన తరువాత మాత్రమే స్పందించాను. చంద్రశేఖరరెడ్డి గారి కుటుంబంతో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. మీ కోసం వారిని దూరం చేసుకోను.
ఈ బంధంపై మీ అభిమానుల చేత తిట్టిస్తున్నారు. డోంట్ కేర్” నేనేమి మీ బానిసను కాదు... కాదు. మీ మోచేతి క్రింది నీళ్ళు త్రాగడం లేదు, త్రాగను కూడా.
గౌరవ తోట త్రిమూర్తులు గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు మీ గురించి నాతో సుమారు 3 గంటలు 2019 ఎన్నికల ముందు మాట్లాడిన సందర్భం మీకు తెలిసే ఉంటుంది. మీకోసం అంత తాపత్రయపడిని గౌరవనీయులను అమలాపురం వేదిక నుండి తోట త్రిమూర్తులు గారిని ఓడించమని చెప్పడం కోసం నాకు సమయం చాలా తక్కువగా ఉంది. ఇక్కడి నుండే పిలుపును ఇస్తున్నాను చిత్తుగా ఓడించమని తమరు సెలవిచ్చారు. మీకోసం ఎంతో తాపత్రయపడిన వీరిని ఓడించమనడం అర్థంకాని ప్రశ్న!
సినిమా చరిత్రలో మీ అభిమానులు పడే బాధలు పెట్టే ఖర్చులు మీ దృష్టికి తేవాలనిపించింది. సినిమా రిలీజుకి కొన్ని రోజుల ముందు ప్లెక్సీలు పెట్టడం, రిలీజు రోజున స్వీట్లు మరియు బాణసంచా కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం.
మొదట రెండు మూడు వారాలు చిత్రం హౌస్ఫుల్ అవ్వకపోతే అమ్ముడు పోని టిక్కెట్లు మీ అభిమానులు డబ్బులు వేసుకుని ప్రతీ రోజు కొంటూఉంటారు.
తల్లికో, తండ్రికో ఒక డ్రింక్ పట్టుకురా లేక పలావు తీసుకురా అంటే డబ్బులు లేవని సమాధానం వస్తాయి పై వాటికి విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. అలా మీ అభిమానులచేత విపరీతంగా సినిమా రిలీజులకు, పుట్టిన రోజులకు వేలాది రూపాయలు ఖర్చు చేయించడం మీ దృష్టిలో?
నా శ్రీమతి మంగళసూత్రం తెంపి లంజా రావే అని పోలీసువారు బూటు కాలితో తన్నినప్పుడు, కొడుకుని లాఠీలతో బాదుకుంటూ పోలీసు వారు తీసుకువెళ్ళినప్పుడు, నా కోడలిని లంజా రావే అని తిట్టినప్పుడు మిమ్మల్ని మా మీద సానుభూతి చూపమని అప్పుడు, ఇప్పుడు అడగలేదే? తమరు రాజకీయ యాత్రలో నా పూర్వం ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ప్రారంభించినప్పుడు తమరి కాళ్ళు మొక్కి బాన్‌చన్ అని చెప్పకపోవడం వల్ల నన్ను కాకినాడ ఎమ్.ఎల్.ఎ గారితో పాటు తిడతారా? తిడితే నేనెందుకు పడాలి?
నన్ను తిట్టడం అంటూ వస్తే నేను పూర్వం ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఎమ్.ఎల్.ఎ గా ఎన్నికయ్యాను కాబట్టి అన్నవరంలోనో, కత్తిపూడిలోనో తిట్టాలి.
కాని కాకినాడ ఎమ్.ఎల్.ఎ గారితో పాటు నన్ను తిట్టాలని ఎందుకు అనుకున్నారో సెలవివ్వాలి. అఖరిగా నా బలమైన కోరిక మీ ముందు పెడుతున్నాను. కాకినాడ ఎమ్.ఎల్.ఎ గారు, నేను కోరినట్టుగా కాకినాడ నుండి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోండి. ఏకారణం చేతనైనా తమరు తోక ముడిస్తే పిఠాపురం నుండి పోటీ చేయడానికి తమరు నిర్ణయం తీసుకుని నన్ను మీ మీదకు పోటీ చేయడానికి నాకు సవాలు విసరమని కోరుకుంటున్నానండి. “చెగువేరా” మీకు ఆదర్శం అని చెప్పుకుంటారు, గుండెలనిండా ధైర్యం ఉందని అంటారు కాబట్టి ఏదో ఒక కోరిక తప్పకుండా తీర్చే శక్తి పౌరుషం మీకు ఉన్నాయని నేను భావిస్తాను.
ఎన్నికల బరిలో ఉండాలా లేదా అనుకుంటున్న సమయంలో మీరు, జనసైనికులు తిట్టడం వల్ల ఎక్కడా లేని ఉత్సాహాం నాలో వచ్చి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు చాలా సంతోషం బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుందనే సంగతి మరువవద్దు