Kothapalli Subbarayudu: జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు(Kothapalli Subbarayadu) జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కొత్తపల్లికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కోరారు. కొత్తపల్లి రాకతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీకి కొత్త ఊపు వస్తుందని.. ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరం అని తెలిపారు. రాజకీయాల్లో ఆయన అనుభవం పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని పవన్ పేర్కొన్నారు.
కాగా ఇటీవల జనసేన పార్టీలో చేరనున్నట్లు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజకీయాల్లో స్వప్రయోజనాలు ఆశించకుండా రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. సినిమాల్లో కష్టపడి సంపాందించిన తన సొంత సొమ్ము వెచ్చించి కౌలు రైతులకు ఆర్ధిక సహాయం అందిచిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని కొనియాడారు. అలాగే రాజధాని అమరావతి విషయంలో, విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ కోసం ఆయన నిర్మొహమాటంగా పోరాటం చేశారన్నారు. పవన్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరనున్నట్లు కొత్తపల్లి ప్రకటించారు.
తాజాగా ఆయన పవన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గోదావరి జిల్లాల జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సీనియర్ నేతలు పార్టీలో చేరడం శుభపరిణామని పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో జనసేన బలమైన ముద్ర వేయడం ఖాయమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన నర్సాపురం నుంచి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే అక్కడ బొమ్మిడి నాయకర్ జనసేన అభ్యర్దిగా ప్రచారంలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్తుందని తెలుస్తోంది. తాజాగా సుబ్బారాయుడు కూడా పార్టీలో చేరడంతో సీటు ఎవరికి దక్కనుందనే ఆసక్తి మొదలైంది. మొత్తంగా చూసుకుంటే ఉభయగోదావరి జిల్లాల్లో జనసేనకు రోజురోజుకు బలం పెరుగుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా సీనియర్ రాజకీయ నాయకుడైన కొత్తపల్లి 1989 అసెంబ్లీ ఎన్నికలో తొలిసారి నర్సాపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి వరుసగా 1994, 1999, 2004 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి గెలిచారు. అయితే ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం 2014లో తిరిగి టీడీపీలో చేరి కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. తదుపరి 2019లో వైసీపీలో చేరారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో విభేదాల కారణంగా ఆ పార్టీని కూడా వీడారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout