Gollapalli Suryarao: టీడీపీలో దళితులకు గౌరవం లేదు.. వైసీపీలో చేరిన మాజీ మంత్రి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల సమయం కావడంతో పార్టీ మారే సంఖ్య ఎక్కువైపోతుంది. ఈ పార్టీలో టికెట్ రాని వారు ఆ పార్టీలోకి.. ఆ పార్టీలో టికెట్ రాని వారు ఈ పార్టీలోకి మారిపోతున్నారు. టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాక టికెట్ రాని ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవలోకి మాజీ మంత్రి గొల్లప్లి సూర్యారావు చేరిపోయారు. రాజోలు టీడీపీ ఇంచార్జ్‌గా గొల్లపల్లి ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు. ఈ క్రమంలో తన కుమార్తెను జనసేన అభ్యర్థిగా నిలబెట్టేందుకు చేసినా ప్రయత్నాలు కూడా విఫలమవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు.
దీంతో పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో పనిచేశానని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి తనకు రాజోలులో సీటు ఇవ్వకుండా అవమానించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డితో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీలోకి రావలసిందిగా ఆహ్వానించారు. దీంతో తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
అనంతరం గొల్లపల్లి మాట్లాడుతూ 43 ఏళ్లుగా రాజకీయాల్లో విలువలతో పనిచేశానని తెలిపారు. చిన్న తప్పు గానీ, పొరపాటు గానీ చేయలేదని అలాంటి తనను చంద్రబాబు, లోకేష్.. మెడపై చేయి వేసి బయటకు గెంటేశారని వాపోయారు. టీడీపీలో దళితులకు గౌరవం లేదని.. తన లాంటి దళిత నేతల బతుకులను చిందర వందర చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ ఏం చెబితే అది చేస్తానని.. ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తానని స్పష్టంచేశారు. అలాగే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌తో కూడా కలిసి పనిచేస్తానని తెలిపారు.
అయితే రాజోలులో ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. ఇప్పుడు గొల్లపల్లి సూర్యారావు పార్టీలో చేరనుండటంతో ఆయను టికెట్ ఇస్తారా లేదా అన్నది స్పష్టం కాలేదు. అమలాపురం లోక్‌సభ టికెట్‌ను గొల్లపల్లికి కేటాయిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు ఒప్పుకోని పక్షంలో అసెంబ్లీ టికెట్ ఇచ్చి.. రాపాకను పార్లమెంట్ బరిలో దింపాలని యోచిస్తున్నారని సమాచారం. కాగా 2014 ఎన్నికల్లో రాజోలు టీడీపీ అభ్యర్థిగా గొల్లపల్లి పోటీచేసి విజయం సాధించారు. 2019లో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అంతకుముందు దివంత నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com