Etela Rajender Wife Jamuna:కేసీఆర్‌పై బరిలోకి ఈటల జమున.. గజ్వేల్ టికెట్ కోసం దరఖాస్తు, బీజేపీ లెక్కలేంటో..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. అందరికంటే ముందే 115 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి కేసీఆర్ విపక్షాలను డిఫెన్స్‌లోకి నెట్టేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా ప్రకటించి నెల రోజులు కావొస్తుండగా.. మిగిలిన రెండు పార్టీలు ఇంక ఎంపిక దగ్గరే వున్నాయి. కేసీఆర్‌ను ఈసారి ఎలాగైనా ఓడించాలని బీజేపీ, కాంగ్రెస్ గట్టి పట్టుదలగా వున్నాయి. సర్వేలు ఇతర లెక్కలు వేసుకుని బలమైన అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో వున్నాయి.
రెండు చోట్ల పోటీ చేస్తున్న కేసీఆర్:
ఇదిలావుండగా కేసీఆర్ ఈసారి రెండు స్థానాల్లో బరిలోకి దిగుతున్నారు. తన సొంత నియోజకవర్గం నుంచి గజ్వేల్‌తో పాటు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. నేతలు, కార్యకర్తల కోరిక మేరకే తాను కామారెడ్డి బరిలో నిలిచినట్లు కేసీఆర్ చెబుతున్నా.. గులాబీ బాస్ లెక్కలు వేరే వున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పార్టీని మరింత పటిష్ట పరచడమే లక్ష్యంగా కేసీఆర్ ఈ ఎత్తుగడ వేసినట్లుగా తెలుస్తోంది.
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ఈటల జమున :
మరోవైపు .. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు భర్త వెంట నడిచిన ఈమె తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతున్నారు. అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తలపడేందుకు. గజ్వేల్ నుంచి టికెట్ కేటాయించాల్సిందిగా జమున దరఖాస్తు చేసుకున్నారు. ఈటల రాజేందర్ ఎప్పటిలాగే తన కంచుకోట హుజురాబాద్ నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
బీజేపీ టికెట్ కోసం 6003 మంది దరఖాస్తు :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆశావహుల నుంచి టికెట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆదివారంతో ఆ గడువు ముగిసింది. మొత్తం 6003 దరఖాస్తులు రాగా.. ఒక్క చివరి రోజే 2,780 దరఖాస్తులు రావడం విశేషం. అయితే ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపు రావు, లక్ష్మణ్, ఎమ్మెల్యే డీకే అరుణ దరఖాస్తు చేసుకోలేదు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ నుంచి దరఖాస్తు చేసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments