జగన్ లక్ష కోట్ల వ్యవహారం.. అసలు విషయం చెప్పిన మాజీ జేడీ
- IndiaGlitz, [Wednesday,April 24 2019]
లక్ష కోట్లు.. లక్ష కోట్లు.. వైఎస్ జగన్ లక్ష కోట్లు దోచుకున్నారు.. జగన్ రాజకీయాలకు అర్హుడు కాదు.. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని దొరికినదంతా దోచుకున్నాడు అని అధికార పార్టీకి చెందిన నేతలు, సీఎం చంద్రబాబు సైతం పలుమార్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం అందరకీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ వ్యవహారంపై జగన్ కేసులకు విచారాణాధికారిగా వ్యవహరించిన సీబీఐ మాజీ జేడీ, జనసేన ఎంపీ అభ్యర్థి వివి. లక్ష్మీ నారాయణ అసలు విషయాలు బయటపెట్టారు.
తాజాగా.. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ జేడీ.. జగన్ అక్రమాస్తుల గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. అసలు జగన్ లక్ష కోట్ల వ్యవహారమేంటి..? నిజంగానే జగన్ లక్ష కోట్లు దోచుకున్నారా..? విచారణాధికారిగా మీరేం పురోగతి సాధించారు..? మీ దగ్గరున్న ఆధారాలేంటి..? ఈ కేసులు ఏం తేల్చారు..? అనే ప్రశ్నలు మాజీ జేడీ ఎదురవ్వగా ఆయన చెప్పిన సమాధానం జగన్‌ను విమర్శిస్తున్న వారికి ఒక చెంపదెబ్బ లాంటిదని చెప్పుకోవచ్చు.
లక్ష్మీ నారాయణ మాటల్లోనే..
జగన్‌పై రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణ అనేది వాళ్లేదో (రాజకీయ ప్రత్యర్థులు) రాజకీయ ప్రచారం కోసం చేసినట్లుగా ఉంది. వాస్తవానికి మాకు వచ్చిన ఆధారాలు మేరకే చార్జిషీట్‌లో పొందుపర్చాము. దాని ప్రకారమైతే.. రూ.1,500 కోట్లు మాత్రమే. లక్ష కోట్లయితే కానే కాదు. జగన్‌పై ఆరోపణలు చేసి, ఎవరో రాజకీయంగా వాడుకుని ఉంటే దానికి మేం చేసేదేమీ లేదు అని లక్ష్మీ నారాయణ తేల్చిచెప్పారు. కాగా ఇన్ని రోజులుగా జగన్‌పై ఈ రేంజ్‌లు విమర్శలు గుప్పిస్తున్న రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులు ఇప్పుడు ఏమంటారో వేచి చూడాల్సిందే మరి. సో.. మొత్తానికి చూస్తే ఇది జగన్ అభిమానులకు, వైసీపీ శ్రేణులకు ఒకింత సంతోషం కలిగించే వార్త అని చెప్పుకోవచ్చు.