TSPSC చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి..? గవర్నర్ ఆమోదమే తరువాయి..
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రక్షాళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే చైర్మన్ పదవితో పాటు కమిషన్ సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించింది. TSPSC చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వైపు కమిటీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
గత అనుభవాల దృష్ట్యా పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించే వ్యక్తికే బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఈ నేథ్యంలో చైర్మన్ పదవి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. దీంతో మహేందర్ రెడ్డితో పాటు మరో రిటైర్డ్ అధికారి, త్వరలో రిటైర్ కానున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే తెలంగాణకు చెందిన మహేందర్ రెడ్డి వైపు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు TSPSC ఛైర్మన్ నియామక ఫైలును గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో పాటు పరీక్షల నిర్వహణలో బోర్డు తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. పేపర్ లీకేజీలో బోర్డులో పని చేసే ఉద్యోగుల హస్తం ఉండటం రాజకీయంగా పెను దుమారం రేపింది. దీంతో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల ప్రకారం బోర్డులో ఛైర్మన్, 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఛైర్మన్ పదవితో పాటు 8 మంది సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే బోర్డులో కీలకమైన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టు కూడా ఖాళీగా ఉంది.
కొత్త బోర్డు సభ్యుల నియామక ప్రక్రియ పూర్తైన వెంటనే పోటీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. మరోవైపు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్లు అనుసరిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆ రాష్ట్రాల కమిషన్లు పనితీరు పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఇటీవల ఢిల్లీలో యూపీఎస్సీ ఛైర్మన్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించేందుకు సలహాలను కోరారు. మొత్తానికి TSPSC ఆధ్వర్యంలో పోటీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com