Phone Tapping Case: మాజీ డీసీపీ రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్‌తో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరి విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ట్యాపింగ్ మాత్రమే వసూళ్ల దందా కూడా చేసినట్లు గుర్తించారు. అలాగే ఎన్నికల సమయంలో ఏకంగా పోలీస్ వాహనాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు డబ్బులను తరలించినట్లు అంగీకరించినట్లు సమాచారం. తాజాగా ఈ కేసులో ఏ4 నిందితుడిగా అరెస్టైన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ ముఖ్య నేతల కనుసన్నల్లోనే జరింగిదని.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా విచారణలో వెల్లడించినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్ష ముఖ్య నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారికి ఆర్థికంగా మద్దతుగా నిలిచిన వ్యాపారవేత్తల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ పార్టీలోని కొంత మంది అనుమానిత నేతలపై కూడా నిఘా పెట్టినట్టు సమాచారం. మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉన్న ఎన్నికల సమయంలో నేతలపై ట్యాపింగ్ చేశామని రిపోర్టులో వెల్లడించినట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా భవ్య సిమెంట్ యజమాని సినీ నిర్మాత ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70 లక్షలు సీజు చేసినట్లు రాధాకిషన్ రావు వెల్లడించినట్టు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న రఘునందన్ రావు, ఆయన బంధువుల నుంచి కోటి రూపాయలు.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన రూ.3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నామని ఒప్పుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. ఈమేరకు టాస్క్ ఫోర్స్ టీంకు మాజీ ఐఏఎస్ అధికారి వాహనాలు సమకూర్చారని వెల్లడించారు.
ఇక 2016 నుంచి ఓ వర్గానికి చెందిన అధికారులతో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు రాధాకిషన్ అంగీకరించినట్టు తెలుస్తోంది. నల్లగొండ నుంచి ప్రణీత్ రావు, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్ రావు, హైదరాబాద్ నుంచి తిరుపతన్నను నియమించుకున్నారట. దీంతో బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో బయటకు వస్తోంది. దీంతో త్వరలోనే ఆ పార్టీకి చెందిన కీలక నేతలను కూడా అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి గులాబీ పార్టీ పెద్దల మెడకు ట్యాపింగ్ వ్యవహారం చిక్కుకోనున్నట్లు అర్థమవుతోంది. మున్మందు ఈ కేసులో ఎలాంటి కీలక పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments