మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఎస్వీ ప్రసాద్ కుటుంబానికి కరోనా సోకింది. దీంతో ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులను సన్నిహితులు చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రిలో చేరారు. అయితే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ క్రమంలోనే ఎస్వీ ప్రసాద్ నేడు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఎస్వీ ప్రసాద్ 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్‌గా ఎస్వీ ప్రసాద్ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఛైర్మన్, కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద ఆయన సీఎస్‌గా పని చేశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్వీ ప్రసాద్ సీఎస్‌గా పనిచేశారు.
అలాగే 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఎస్వీ ప్రసాద్ సీఎస్‌గా నియమితులయ్యారు. తన కంటే 20 మంది సీనియర్ అధికారులున్నా.. ఎస్వీ ప్రసాద్‌నే సీఎస్ పోస్టు వరించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్‌గానూ ఎస్వీ ప్రసాద్ పనిచేశారు. నిబద్ధత కలిగిన ఉన్నతాధికారిగా ఎస్వీ ప్రసాద్ గుర్తింపు పొందారు. ప్రసాద్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments