Kiran kumar Reddy : కాంగ్రెస్‌కు కిరణ్ కుమార్ రెడ్డి గుడ్‌బై, త్వరలోనే బీజేపీలోకి..?
- IndiaGlitz, [Monday,March 13 2023]
ఊహాగానాలే నిజమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖను పంపారు. త్వరలోనే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కమలనాథులతో ఆయన చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలోకి :
ఆంధ్రప్రదేశ్ విభజనను చివరి వరకు వ్యతిరేకించి సొంతపార్టీపైనే పోరాటం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ ఆయన ప్రయత్నం వృథా ప్రయాసే అయ్యింది. చివరికి తెలుగు నేల రెండు ముక్కలు కావడంతో సీఎం, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా వున్న ఆయన.. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అయినప్పటికీ మౌనంగానే వుంటున్నారు.
తండ్రి మరణంతో రాజకీయాల్లోకి :
తన తండ్రి నల్లారి అమర్‌నాథ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన కాంగ్రెస్ బడిలోనే ఓనమాలు దిద్దారు. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్మంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ప్రభుత్వ చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా పనిచేశారు. అనంతరం 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి .. 2014 ఫిబ్రవరి 19 వరకు పనిచేశారు.