ఎట్టకేలకు కదిలిన నౌక
Send us your feedback to audioarticles@vaarta.com
సూయెజ్ కాలువలో కూరుకుపోయిన రాకాసి నౌక ‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది. సుమారు ఆరు రోజులుగా పడుతున్న కష్టానికి సోమవారం ఫలితం లభించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత మంగళవారం ఈ ఓడ సూయజ్ కాలువలో చిక్కుకుపోయింది. దీని కారణంగా సూయెజ్ కాలువలో సరుకు రవాణా ఒక్కసారిగా ఆగిపోయింది. అంతర్జాతీయ సరుకు రవాణాలో ఈ కాలువ కీలకం కావడంతో రోజుకు రూ.72 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ సేపథ్యంలో ఈ రాకాసి నౌకను కదిలించేందుకు అంతర్జాతీయ నిపుణులు రంగంలోకి దిగారు. నౌక ముందు భాగం కూరుకుపోయిన చోట ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్ల సాయంతో తవ్వుతూ.. మరోవైపు నౌకను కదిలించేందుకు టగ్బోట్లను వినియోగించారు. అదే సమయంలో నౌక కింద నీటిని పంప్ చేశారు.<
చివరకు నిపుణుల ప్రయత్నం ఫలించింది. తొలుత పాక్షికంగా కదిలిన ఈ నౌక తర్వాత నీటిపై పూర్తిగా తేలియాడి.. ప్రస్తుతం సాఫీగా ప్రయాణం సాగిస్తోందని మారిటైమ్ సర్వీసెస్ ప్రొవైడర్ ఇంచ్ కేప్ వెల్లడించింది. దీనికోసం 18 మీటర్ల లోతులో దాదాపు 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. అనంతరం, కెనాల్ ఉత్తర, దక్షిణ తీరాలకు మధ్యనున్న వెడల్పైన ‘గ్రేట్ బిట్టర్ లేక్’ వద్దకు 2.2 లక్షల టన్నుల బరువైన ఆ నౌకను తీసుకు రాగలిగారు. కాగా.. ఈ నౌక చిక్కుకుపోవడంతో 367 వాణిజ్య నౌకలు స్తంభించి పోయాయి. ఇక ఇప్పుడే తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించిన ఈ నౌకలు కాలువ దాటడానికి పది రోజుల సమయం పడుతుందని అంచనా. అంతర్జాతీయ సరకు రవాణా వాణిజ్యంలో 10% సూయెజ్ కాలువ ద్వారా జరుగుతుంది. క్రూడాయిల్ రవాణాలో ఈ మార్గం వాటా దాదాపు 7%. గత సంవత్సరం ఈ మార్గం గుండా 19 వేలకు పైగా నౌకలు వెళ్లాయి.
సూయజ్ కాలువలో రాకపోకలు నిలిచి పోవడంతో ఈజిప్ట్ ప్రభుత్వానికి ఇప్పటి వరకూ 95 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 710 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయితే నౌక కదులుతున్న దృశ్యాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలను ‘మెరైన్‌ట్రాఫిక్.కామ్’ వెబ్సైట్లో పొందుపర్చారు. ఒకవేళ ఈ విధానం సఫలం కానట్లైతే.. ప్రస్తుతం నౌకలో ఉన్న దాదాపు 20 వేల కంటెయినర్లను వేరే షిప్‌లోకి మార్చి.. బరువు తగ్గిన తరువాత ఈ నౌకను కదిలించాల్సి వచ్చేది. కానీ నౌకను కదిలించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్న ‘బొస్కాలిన్’ సంస్థ తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించింది. ఆ పని పూర్తికాగానే తమ పని పూర్తి చేశామని.. ఈ కాలువ ద్వారా రవాణా మళ్లీ ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమమయిందని బొస్కాలిన్ సంస్థ సీఈఓ పీటర్ ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments