YSRCP: తాజా సర్వేలోనూ వైసీపీ ప్రభంజనం.. మరోసారి అధికారం ఖాయం..
- IndiaGlitz, [Tuesday,January 02 2024]
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. మరో రెండు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు పోల్ సమరానికి సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని సర్వే సంస్థలు ఏ పార్టీ అధికారంలోకి రానుందో ముందే అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన అనేక సర్వేల్లో మరోసారి వైసీపీదే ప్రభంజనం తేల్చిచెప్పాయి. తాజాగా విడుదలైన పబ్లిక్ ఓపినీయన్ సర్వేలో కూడా వైసీపీదే అధికారం అని తేలింది. ఈ సంస్థ డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల 80వేల మందిని అడిగి ఈ ఫలితాలు వెల్లడించింది. ప్రభుత్వం పనితీరు, సంక్షేమ పథకాలు అందుకుతన్నాయా వంటి అంశాలపై సర్వే నిర్వహించింది.
ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగి.. టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి 51.3శాతం ఓట్లతో 146 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక టీడీపీకి 35.9శాతం ఓట్లతో 29 సీట్లు వస్తాయని వెల్లడించింది. అలాగే జనసేనకు 7.4శాతం ఓట్లు లభిస్తాయని పేర్కొంది.
టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసినా వైసీపీదే అధికారం అని తేల్చింది. రెండు పార్టీలు జట్టు కట్టినా వైసీపీకి 51శాతం ఓట్లతో 128 స్థానాలు వస్తాయంది. ఇక టీడీపీ-జనసేన కూటమి 40.5శాతం ఓట్లతో 47 స్థానాలు గెలుచుకుంటుందని ఈ సంస్థ వివరించింది.
అలాగే టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీకే ప్లస్ అవుతుందని చెప్పుకొచ్చింది. 51.6శాతం ఓట్లు దక్కించుకుని వైసీపీ 133 సీట్లు సాధిస్తుందని.. కూటమి 37.4శాతం ఓట్లతో 42 స్థానాలకే పరిమితమవుతాయని స్పష్టం చేసింది.
మొత్తానికి ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేసినా, ఉమ్మడిగా పోటీ చేసినా ఫ్యాన్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఈ సర్వేలో వెల్లడైంది. ఇదే కాదు ఇటీవల విడుదలైన జన్ మత్ పోల్స్ సర్వేలోనూ వైసీపీదే అధికారం అని తేలింది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లోనూ జగన్ పార్టీ 24-25 స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ సర్వే కూడా ప్రకటించింది. అంటే ఈ లెక్కన 150 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని అర్థమవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏ సంస్థ సర్వే చేసినా వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం పక్కా అని తేలుతుంది.