సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో స్క్రీన్ ప్లేకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సన్నివేశాలను ఎంత ఆసక్తికరంగా మలిచామనే దాని మీదనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అలాంటి ఓ ఎంగేజింగ్ స్క్రిప్ట్‌తో అడివిశేష్, వెంకట్ రామ్ జీ అండ్ టీమ్ రూపొందించిన సినిమాయే `ఎవరు`. `క్షణం`, `అమీతుమీ`, `గూఢచారి` సినిమాలతో సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న అడివిశేష్ ఈసారి `ఎవరు` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరి సినిమా ప్రేక్షకుడిని ఏ మేర ఆకట్టుకుందో తెలియాలంటే సినిమా కథేంటో చూద్దాం…
కథ:
వ్యాపారవేత్త రాహుల్ భార్య సమీర(రెజీనా కసండ్ర)ను ఓ హత్యానేరం మీద పోలీసులు అరెస్ట్ చేస్తారు. సమీర చంపింది పోలీస్ ఆఫీసర్ అశోక్(నవీన్ చంద్ర)ని కావడంతో పోలీసులు కేసుని సీరియస్‌గా తీసుకుంటారు. పోలీసులు తరపున రోహిత్ అనే గొప్ప క్రిమినల్ లాయర్ కేసుని వాదించడానికి ముందుకొస్తాడు. తప్పు తనది కాకపోయినా.. శిక్ష పడితే ఎక్కడ తన పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందోనని సమీర భయపడుతుంది. కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ విక్రమ్ వాసుదేవ్(అడివిశేష్)కి డబ్బులు ఇస్తామని ప్రలోభ పెడతారు. కోర్టులో ఎలాంటి ఆధారాలు ప్రవేశ పెడతారో చెప్పాలని విక్రమ్‌సహదేవ్‌ని కోరుతారు. సమీరతో మాట్లాడి కేసుకి సంబంధించిన వివరాలను తెలుసుకుని సాయం చేయడానికి విక్రమ్ ఆమె ఉండే హోటల్ గదికి చేరుకుంటాడు. కేసు ఇన్వెస్టిగేషన్‌లో తాను సేకరించిన ఆధారాలను చూపెడుతూ, అసలేం జరిగింది? కేసుని ఎలా పక్క దారి పట్టింవచ్చో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఆదిత్య వర్మ అనే యువకుడు తన నాన్న వినయ్ వర్మ(మురళీ శర్మ) కనిపించడం లేదంటూ పెట్టిన కేసు చర్చకు వస్తుంది. విక్రమ్ ఆ కేసుకి సంబంధించి వివరాలను చెబుతూ వస్తాడు. అసలు వినయ వర్మ ఎవరు? ఎందుకు కనపడకుండా పోతాడు? అసలు సమీర కేసుతో వినయ్ వర్మకు ఏమైనా సంబంధం ఉంటుందా? అశోక్ హత్య కేసులో దోషి ఎవరు? విక్రమ్ వాసుదేవ్ కేసును ఎలా డీల్ చేస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
హంతకుడు ఎంత తెలివైన వాడైనా ఎక్కడో చేసే చిన్న పొరపాటే దొరికిపోయేలా చేస్తుందనే చిన్న పాయింట్‌తో పాటు.. తండ్రి కోసం ఓ కొడుకు ఏం చేశాడు? తన తండ్రి చావుకు ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? కష్టాల్లో మనోధైర్యం కోల్పోకూడదు అని ధైర్యం చెప్పిన తండ్రి మాటలను కొడుకు ఎలా పాటించాడు? అనే విషయాలను బేస్ చేసుకుని ఆద్యంతం ఆసక్తికరంగా డైరెక్టర్ వెంకట్ రామ్‌జీ, హీరో అడివిశేష్ అండ్ టీమ్ తెరకెక్కించిన చిత్రమే `ఎవరు`.సినిమా తొలి సన్నివేశం నుండి క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్‌గా సినిమా రన్ అవుతుంది. ప్రధానంగా ఐదారు పాత్రలను బేస్ చేసుకునే ఈ సినిమా మొత్తం రన్ అవుతుంది. కాబట్టి దర్శకుడు సన్నివేశాలను లింక్ పెడుతూ ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా సినిమాను తెరకెక్కించాడు. సినిమా అంతా రెజీనా మర్డర్ మీదే రన్ అవుతుందనిపించేలా సినిమా స్టార్ట్ అవుతుంది.. మరో చోట ఎండ్ అయ్యేలా సినిమా స్క్రీన్ ప్లేను డిజైన్ చేశారు. సన్నివేశాల చిత్రీకరణలో ఎక్కడా బోరింగ్ అనిపించదు. అనవసరమైన సన్నివేశాలు కూడా లేవు. ఇక సన్నివేశాలను శ్రీచరణ్ పాకాల తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం బావుంది. గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్ తీరుని అభినందించాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే ఇందులో పాత్రలన్ని డబుల్ షేడ్‌లో కనపడతాయి. సినిమాలో కొంత సేపు ఈ పాత్ర ఇలా ఉందే అని నిర్ధారణకు వచ్చేసరికి వాటి స్వరూపం మారిపోతుంటుంది. ఇలాంటి పాత్రలను పోషించాలంటే నటీనటుల్లో విషయముండాలి. అడివిశేష్, రెజీనా, నవీన్ చంద్ర కీలకంగా సినిమాను తమదైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. మురళీశర్మ, పవిత్రా లోకేష్ సహా ఇతర పాత్రధారులు పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
చివరగా..ఆద్యంతం ప్రేక్షకుడిని కట్టిపడేసే ఆసక్తికరమైన మలుపులున్న ఎంగేజింగ్ థ్రిల్లర్ `ఎవరు`
Comments