ప్రభుత్వం నీచానికి దిగజారింది: ఈటల సతీమణి జమున
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుత్వ యంత్రాంగంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున మండిపడ్డారు. మాసాయిపేటలో మోడ్రన్ హ్యాచరిస్ పెట్టాలని 46 ఎకరాలు కొన్నామని, బడుగు బలహీనవర్గాల భూమి కాజేశామని దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. నెల రోజులుగా జమున హెచ్చరిస్, గోడౌన్ ల మీద ఈ ప్రభుత్వం బురద జల్లుతూనే ఉందని జమున పేర్కొన్నారు. తాము కష్టాన్ని నమ్ముకున్న వాళ్లమని.. తామెలాంటి తప్పూ చేయలేదన్నారు. అసత్య ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టలో తమకు తెలుసన్నారు. తన కొడుకు వ్యాపారం నిమిత్తం మూసాయిపేటలో 46 ఎకరాల భూమి కొన్న మాట వాస్తవమేనని.. అంతకంటే ఎక్కువ భూమి ఉందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. లేకుంటే అధికారులు ముక్కు నేలకు రాస్తారా? అని జమున సవాల్ విసిరారు.
పత్రిక ఉందని ఎలా పడితే అలా రాస్తారా? ఏదైనా చేస్తారా? అని ఆమె మండిపడ్డారు. తమకు సమాచారం ఇవ్వకుండా తమ భూములు కొలవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు ఎప్పటికైనా బయటపడతాయని, ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కోసం భూమి ఇచ్చిన కుటుంబం తమదని జమున పేర్కొన్నారు. ఒక మహిళగా తాను అనేక మందికి ఉపాధిని ఇస్తున్నానని.. ఇదేనా మహిళా సాధికారత అని ప్రశ్నించారు. దేవరాయాంజల్‌లో తాము భూములు అక్రమించుకున్నామని రాస్తున్న పత్రికకు సిగ్గుండాలంటూ జమున మండిపడ్డారు. ఆ భూములను కుదువ పెట్టే తాము ఆ పత్రికకు సహాయం చేశామని వెల్లడించారు. ఆ రోజు అవి దేవుని భూములని తెలియదా? అని ప్రశ్నించారు. దేవుని భూములైతే బ్యాంక్ ఎలా లోన్ ఇస్తుందని నిలదీశారు.
ప్రభుత్వం నీచానికి దిగజారిందని జమున మండిపడ్డారు. తమ ఇంట్లోవాళ్లను అందరినీ రోడ్డుకు లాగాలని స్కెచ్ వేశారన్నారు. తన కొడుకును బయటకు లాగడానికి రావలకోల్ భూములు అక్రమించారని చెబుతున్నారని.. నలుగురి చేతులు మారిన తర్వాత తాము కొన్నామని వెల్లడించారు. ఈటల రాజేందర్ మీద ఆరోపణలు వచ్చిన వెంటనే యంత్రాంగం మొత్తం కదులుతోందని... రైతుల భూములు కొలవాలంటే మాత్రం కదలరని ఆమె విమర్శించారు. ఈటలను బయటకు పంపిస్తే తమ కుటుంబమే పాలించుకోవచ్చని ప్రగతి భవన్ స్కెచ్ వేసిందన్నారు. తాము ఏ విచారణకైనా సిద్ధమని.. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని జమున డిమాండ్ చేశారు.
ఉద్యమంలో మేము డబ్బులు పెట్టిన రోజు ఎక్కడివి అని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. మంత్రులు కూడా ఒకరింటికి ఒకరు దొంగ తనంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆస్తులు కాపాడుకోవడానికి, పదవుల కోసమైతే ఆనాడే వైఎస్ దగ్గరకు వెళ్ళేవాళ్ళమని జమున స్పష్టం చేశారు. వకులాభరణం లాంటి చీప్ మనుషులతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. తమ్మి తమ్మి అని తడిబట్టతో గొంతు కోశారన్నారు. కులరహిత సమాజం కోసమే రాజేందర్, తాను పెళ్లి చేసుకున్నామన్నారు. కానీ తెలంగాణ వచ్చాక కులాలుగా విభజించారన్నారు. తెలంగాణ వచ్చాక ఏనాడు సంతోషంగా లేమని... అన్నీ అవమానాలేనన్నారు. ఆస్తులు అమ్మైనా ఆత్మగౌరవ పోరాటం చేయాలని తన భర్తకు చెబుతున్నానని జమున వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments